Collector Koya Sriharsha : పారిశుద్ధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ
ప్రతి గ్రామంలో పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ, వైరల్ జ్వరాల
దిశ, సుల్తానాబాద్: ప్రతి గ్రామంలో పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ, వైరల్ జ్వరాల నివారణకు ప్రత్యేక చర్య గైకొనాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సుల్తానాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరా, మొక్కల పెంపకం, వైరల్ జ్వరాల నివారణ తదితర అంశాలపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. గ్రామాలలో జరుగుతున్న పారిశుధ్యం, వన మహోత్సవం కార్యక్రమం, పాఠశాల విద్య, విద్యుత్ సరఫరా, త్రాగునీటి సరఫరా, వైరల్ జ్వరాలు తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పించాలని, వర్షాకాలంలో నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు అధికమై వైరల్ జ్వరాలు అధికంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. డెంగ్యూ కేసులు గుర్తించిన పరిసర ప్రాంతాలలో ఫీవర్ సర్వే కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. గ్రామంలో సరఫరా చేసే త్రాగు నీటి నాణ్యతను పక్కాగా పరీక్షించాలని అన్నారు. ప్రతి ఇంటికి త్రాగునీరు సరఫరా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాలలో ఎక్కడ డార్క్ ఏరియా ఉండటానికి వీల్లేదని, అవసరమైన చోట వెంటనే వీధి దీపాలను ఏర్పాటు చేయాలని, ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా నిర్వహించాలని సూచించారు. గ్రామంలో వనమహోత్సవం కింద నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
సుల్తానాబాద్ లోని 30 పడకల ఆసుపత్రి సందర్శించిన కలెక్టర్....
సుల్తానాబాద్ లోని 30 పడకల ఆసుపత్రి రోగులకు అందుతున్న వివిధ వైద్య సేవల పై అధికారులతో సమీక్షించారు. సుల్తానాబాద్ ఆసుపత్రిలోకి వస్తున్న వైరల్ జ్వరాల కేసులు, వారికి అందిస్తున్న చికిత్స వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. సుల్తానాబాద్ పరిధిలోని వైద్య అధికారులు ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, సుల్తానాబాద్ మండల ప్రత్యేక అధికారి జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీవో దివ్య దర్శన్ రావు, తహసిల్దార్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ రమాదేవి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నన్నారు.