రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోండి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తులు స్వీకరించడానికి రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం మెప్మా విభాగంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ (ఎఫ్ఏసీ ) & అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు ) జె. అరుణ శ్రీ బుధవారం తెలిపారు.

దిశ, గోదావరిఖని : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తులు స్వీకరించడానికి రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం మెప్మా విభాగంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ (ఎఫ్ఏసీ ) & అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు ) జె. అరుణ శ్రీ బుధవారం తెలిపారు. నిరుద్యోగులు స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించుకోవడానికై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ (ఇ డబ్ల్యూఎస్ ) కార్పొరేషన్ ల ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేసేందుకు ప్రవేశపెట్టిన ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 14వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఆన్ లైన్ లో https://tgobmms.cgg.gov.in లో దరఖాస్తు చేసుకొని, హార్డు కాపీలను నగర పాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ లో అందజేయాలని కోరారు.
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోలేని వారు నిర్ణీత ప్రోఫార్మా లో దరఖాస్తు పూరించి ఆధార్, రేషన్ కార్డు, తాజా ఆదాయ ధృవీకరణ పత్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో జత చేసి నేరుగా అందించినా నగర పాలక సంస్థ కార్యాలయంలో స్వీకరిస్తారని తెలిపారు. రవాణా వాహనాల యూనిట్ల కు దరఖాస్తు చేసుకునేవారు శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్, వ్యవసాయ రంగ యూనిట్లకు దరఖాస్తు చేసుకునే వారు పట్టా పాసు పుస్తకం, వికలాంగులైతే సదరన్ ధృవీకరణ పత్రాలు అదనంగా జత చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి 21 నుండి 55 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు అర్హులు కాగా వ్యవసాయ యూనిట్లు స్థాపించుకునే వారికి 60 ఏళ్ల వరకు అవకాశం ఉందని తెలిపారు.
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో దరఖాస్తు చేసుకునేవారి కుటుంబ వార్షికాదాయం రెండు లక్షల రూపాయలలోపు ఉండాలని తెలిపారు. రూ.50 వేలలోపు యూనిట్లకు వంద శాతం, లక్ష లోపు యూనిట్లకు 90 శాతం, రెండు లక్షల లోపు యూనిట్లకు ఎనబై శాతం, నాలుగు లక్షల లోపు యూనిట్లకు 70 శాతం సబ్సిడీ అందజేస్తారని పేర్కొన్నారు. యూనిట్ వ్యయంలో సబ్సిడీ పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణంగా మంజూరు చేస్తారన్నారు. ఆసక్తి ఉన్న వారు చివరి రోజు వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం కల్పించిన సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.