Railway Vigilance Officer : పాలిటెక్నిక్ కళాశాలలో అలుమ్నిటాక్స్ కార్యక్రమం..
వేములవాడ అర్బన్ మండలం ఆగ్రహారంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం కళాశాల ప్రిన్సిపాల్ బి.రాజగోపాల్ అధ్యక్షతన అలుమ్ని టాక్స్ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
దిశ, వేములవాడ : వేములవాడ అర్బన్ మండలం ఆగ్రహారంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం కళాశాల ప్రిన్సిపాల్ బి.రాజగోపాల్ అధ్యక్షతన అలుమ్ని టాక్స్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల పూర్వ విద్యార్థి, ప్రస్తుతం భారత రైల్వేలో ఛీఫ్ విజిలెన్స్ అధికారిగా పనిచేస్తున్న గాజుల శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై ఎలక్ట్రికల్ విభాగం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేకుండా ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ లను ఊహించలేమని, దేశాభివృద్దిలో కోర్ ఇంజనీరింగ్ బ్రాంచీలు సివిల్, మెకానిక్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ల పాత్రను వివరించారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ను సమగ్రంగా అభిరుచితో చదవాలని, ప్రాథమిక విషయాల పై పట్టు సాధించాలని, కృషి, సాధనతో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు.
ఎలక్ట్రికల్ ట్రాక్షన్ పనితీరును, ప్రమాదాల నివారణను సోదాహరణంగా వివరించారు. ప్రాక్టికల్ విజ్ఞానాన్ని, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంచుకోవాలని తెలిపారు. భారత రైల్వేలో ఎలక్ట్రికల్ డిప్లొమా విద్యార్థులకు జూనియర్ ఇంజనీర్ గా, లోకో ఫైలేట్ గా గల పలు అవకాశాలను వివరించారు. అనంతరం ప్రిన్సిపల్ డాక్టర్ బి.రాజగోపాల్ మాట్లాడుతూ అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాలలో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఉద్యోగాల్లో ఉన్నారని, పూర్వ విద్యార్థులు తమ ఉన్నత విద్యలో, ఉపాధి పొందడంలో ఉద్యోగ ప్రస్థానంలో నేర్చుకున్న అనుభవాన్ని కళాశాల 2019 సంవత్సరంలో ఏర్పాటు చేసిన అలుమ్ని టాక్స్ కార్యక్రమం ప్రస్తుతవిద్యార్థులకు వివరిస్తూ వారికి స్పూర్తిగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎలక్ట్రికల్ శాఖాధిపతి రవీందర్, ఉపన్యాసకులు హిమజ, హసీనా బేగం, నర్మద, కళాశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.