ఇక జాయింట్ ఎంక్వయిరీలు.. ఈడీ దర్యాప్తు షెడ్యూల్ ఫిక్స్!
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇకపైన దర్యాప్తును ముమ్మరం చేయనున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇకపైన దర్యాప్తును ముమ్మరం చేయనున్నది. ఇప్పటివరకూ సేకరించిన వివరాలతో తదుపరి ఎంక్వయిరీ ప్రక్రియపై నిర్దిష్టమైన యాక్షన్ ప్లాన్‌ను రూపొందించింది. ఈ నెల 16 నుంచే అమల్లోకి తెచ్చిన ఈ ప్లాన్‌లో భాగంగా ఈ నెల 20 నుంచి కీలకమైన ఘట్టం ప్రారంభం కానున్నదని భావిస్తున్నది. ఆ ప్రకారమే వరుసగా ఒక్కొక్కరికి నోటీసులు జారీ చేసి ఏ రోజున ఎవరిని ఎంక్వయిరీ చేయాలో షెడ్యూలు రూపొందించుకున్నది. ఇప్పటివరకూ విడివిడిగా అనుమానితులను, నిందితులను విచారించిన అధికారులు.. ఇకపైన జాయింట్ ఎంక్వయిరీలు చేయాలని భావిస్తున్నారు.
ఇప్పటికే కొద్దిమందిని కలిపి ఈడీ ప్రశ్నించింది. రానున్న రోజుల్లో దీన్నే కొనసాగించనున్నది. స్పెషల్ కోర్టులో వాదనల సందర్భంగా ఈడీ తరపు న్యాయవాది ఇదే విషయాన్ని వెల్లడించారు. లిక్కర్ పాలసీలో సౌత్ గ్రూపు ప్రమేయాన్ని, ముడుపుల రూపంలో ముట్టిన డబ్బు మూలాలను వెలికి తీయాలని ఈడీ భావిస్తున్నది. ఈ నెల 20 నుంచి కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. అందులో భాగంగానే పలువురి ఈడీ కస్టడీని పొడిగించింది.
మరికొద్ది మందికి నోటీసులు జారీ చేసింది. ఈ మొత్తం స్కామ్‌లో కీలకమైన వ్యక్తి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాగా భావిస్తున్న ఈడీ.. సౌత్ గ్రూపులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆమెకు గతంలో వ్యక్తిగత ఆడిటర్‌గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబు, ఆమె ప్రతినిధిగా గ్రూపు తరఫున వ్యవహరించిన అరుణ్ రామచంద్ర పిళ్లయ్ పాత్ర ఏ మేరకు ఉన్నదో ఆధారాలతో సహా స్పష్టతకు రావాలనుకుంటున్నది. అందుకే కవితతో పాటు పిళ్లయ్, బుచ్చిబాబు, సిసోడియాను కలిపి విచారించవచ్చనే వార్తలు వెలువడుతున్నాయి.
జాయింట్ ఎంక్వయిరీలతో ఈడీ దూకుడు
తొలిసారిగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు జారీచేసింది. ఢిల్లీ హెడ్‌క్వార్టర్‌లో ఆయనను శనివారం విచారించనున్నది. ఆయన నుంచి వచ్చే వివరాలకు అనుగుణంగా ఎన్ని రోజుల పాటు ఈ ఎంక్వయిరీ ఉంటుందనేది ఖరారవుతుంది. ఇదే గ్రూపులో కీలక వ్యక్తి అనే అంచనాతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈ నెల 20న విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీచేసింది. ఆమె ఇప్పటికే సమర్పించిన 12 రకాల డాక్యుమెంట్లలోని ఆర్థిక అంశాలను ఈడీ విశ్లేషిస్తున్నది. ఈ నెల 20న జరిగే ఎంక్వయిరీ సందర్భంగా వాటికి సంబంధించి మరిన్ని వివరాలను స్టేట్‌మెంట్ల రూపంలో రికార్డు చేయాలనుకుంటున్నది.
లిక్కర్ పాలసీ రూపకల్పనలో, ఆమ్ ఆద్మీ పార్టీకి కిక్‌బ్యాక్ రూపంలో ముట్టిన ముడుపుల్లో కవిత ప్రమేయం ఉన్నదంటూ ఇప్పటికే పిళ్లయ్ సహా పలువురు వెల్లడించారు. మనీశ్ సిసోడియాతో ‘పొలిటికల్ అండర్‌స్టాండింగ్’ ఉన్నదంటూ ఇప్పటికే పిళ్లయ్ వివరించారు. దాని లోతులను వెలికితీయడానికి ఈ నెల 20న లేదా ఆ తర్వాత కవితను, సిసోడియాను కలిపి విచారించే చాన్స్ ఉన్నది. పిళ్లయ్‌ను, బుచ్చిబాబును సైతం ఆమెతో కలిపి విచారించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇప్పటికే బుచ్చిబాబు ఈడీ అధికారుల అదుపులో ఉన్నారు. రెండు రోజులుగా ఆయనను అధికారులు ప్రశ్నిస్తున్నారు. పిళ్లయ్ కస్టడీ ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనున్నది. కవితను ఈ నెల 20న విచారణకు పిలిచారు. వీటన్నింటి నేపథ్యంలో ఈ ముగ్గురితో కలిపి జాయింట్ ఎంక్వయిరీ ఉండొచ్చని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి.
అవసరమైతే సిసోడియా, ఎంపీ మాగుంట కూడా
సౌత్ గ్రూపులో కవిత తరఫున పిళ్లయ్ ప్రతినిధిగా, ఆర్థిక వ్యవహారాలు చూసే ప్రతినిధిగా బుచ్చిబాబు వ్యవహరించారన్నది ఈడీ వాదన. అందుకే ఈ ముగ్గురినీ కలిపి విచారించాలని భావిస్తున్నది. సిసోడియాతో పొలిటికల్ అండర్ స్టాండింగ్ ఉందన్న పిళ్లయ్ స్టేట్‌మెంట్‌తో ఆయనను (సిసోడియా)ను కూడా కలిపి విచారించే అవకాశమున్నది. సౌత్ గ్రూపులో కవితతో పాటు ఎంపీ మాగుంట కూడా భాగస్వామి అని ఇప్పటికే ఈడీ కామెంట్ చేసినందున అవసరాన్ని బట్టి ఆయనను కూడా కవితతో కలిపి విచారించేందుకు అవకాశాలున్నాయి. ఎవరితో ఎవరిని కలిపి విచారించాలన్నది ఈడీ అధికారులు వివరంగా చెప్పకపోయినా జాయింట్ (కాన్‌ఫ్రంటేషన్) ఎంక్వయిరీలు ఉంటాయని మాత్రం వెల్లడించారు.
విచారణలన్నింటికీ ఈడీ హెడ్ క్వార్టర్ వేదికగా మారనున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈడీ ఆఫీసు చుట్టూ పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు కానున్నది. పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 ఇప్పటికే కొనసాగుతున్నది. సిసోడియా, గతంలో ఆయనకు (ఎక్సయిజ్ శాఖకు) కార్యదర్శిగా పనిచేసిన సీ అరవింద్, ఎక్సయిజ్ మాజీ కమిషనర్ రాహుల్‌సింగ్, సిసోడియాకు సన్నిహితంగా ఉన్న దినేశ్ అరోరా (సీబీఐ దర్యాప్తులో అప్రూవర్‌గా మారారు), బడ్డీ రిటెయిల్స్ కంపెనీకి చెందిన అమిత్ అరోరా తదితరులంతా ఈ నెల 20 వరకు ఈడీ ఎంక్వయిరీకి హాజరుకానున్నారు. వీరి నుంచి వచ్చే వివరాలకు అనుగుణంగా మరికొద్దిమందితో కలిపి జాయింట్ ఎంక్వయిరీ జరగనున్నది. వీరిని సిసోడియాతో కలిపి జాయింట్‌గా విచారించనున్నట్టు స్పెషల్ కోర్టుకు ఈడీ తరఫు న్యాయవాది జోహెబ్ హొస్సేన్ స్పష్టం చేశారు.
కవితతో కలిపి?
కవితతో కలిపి ఎవరిని విచారిస్తారనేది ఈడీ అధికారులు వెల్లడించకున్నా పిళ్లయ్, బుచ్చిబాబుతో తప్పనిసరిగా జాయింట్ ఎంక్వయిరీ ఉంటుందని సూచనప్రాయంగా తెలిపారు. ఈడీకి కవిత ఈ నెల 16న రాసిన లేఖలో జాయింట్ ఎంక్వయిరీ ఉంటుందని అధికారులు వెల్లడించిన విషయాన్ని ప్రస్తావించడం దీనికి బలం చేకూరుస్తున్నది. జాయింట్ ఎంక్వయిరీ కోసం పకడ్బందీగా నిందితులు, అనుమానితులకు విడివిడిగా నోటీసులను జారీచేసి విచారణకు రావాల్సిందిగా స్పష్టత ఇచ్చింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎక్సయిజ్ శాఖతో సంబంధం లేకుండానే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, సౌత్ గ్రూపు సభ్యుల మధ్య సంప్రదింపులు జరిగాయని ఈడీ ఆరోపిస్తున్నది. డ్రాఫ్ట్ పాలసీని ఫైనల్ చేసింది కూడా ఢిల్లీ ఎక్సయిజ్ శాఖ కాదని, సౌత్ గ్రూపు సభ్యులేనని పేర్కొన్నది. ఈ విషయాన్ని ఇప్పటికే ఢిల్లీ ఎక్సయిజ్ శాఖ అధికారుల స్టేట్‌మెంట్ల ద్వారా సేకరించిన ఈడీ ఇకపైన జాయింట్ ఎంక్వయిరీల ద్వారా ధ్రువీకరించనున్నది. హైదరాబాద్‌లోని కోహినూర్ హోటల్‌లో ఎవరెవరి మధ్య చర్చలు జరిగాయి? ఎంత ముడుపులకు ఒప్పందం కుదిరింది? హవాలా మార్గంలో ఎక్కడికి చేరాయి? వాటిని సమకూర్చిందెవరు?
ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో నాలుగైదు రోజుల పాటు జరిగిన చర్చలు, టాక్స్ స్ట్రక్చర్‌లో జరిగిన మార్పులు, దానికి ఢిల్లీ రాష్ట్ర మంత్రివర్గంతో సంబంధం లేకుండా ఖరారైన పాలసీ, వాట్సాప్‌ల ద్వారా బైటకు లీకైన డ్రాఫ్ట్ పాలసీ, తరచూ ఫోన్లు మార్చడం వెనక ఉన్న కుట్ర తదితరాలన్నింటినీ వారి ద్వారానే సేకరించాలని ఈడీ ప్లాన్ చేసుకున్నది.
వ్యూహాత్మకంగా..
ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు ప్రక్రియ ఒక ఘట్టమైతే ఈ నెల 16 నుంచి మొదలైన ప్రక్రియ చాలా కీలకమైనదని ఈడీ భావిస్తున్నది. పలువురి కస్టడీని పొడిగించడం, కొద్దిమందికి ఎంక్వయిరీకి నోటీసులు జారీ చేయడం వెనక ఈడీ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నట్టు స్పష్టమవుతున్నది. రానున్న రోజుల్లో ఎవరెవరిని అరెస్టు చేస్తారు? వారిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఏయే విషయాలు రాబడతారన్నది కీలకంగా మారింది. దర్యాప్తు ప్రక్రియ కొలిక్కి వస్తున్నదని, ఇది కీలక సమయమని, పలువురి కస్టడీని పొడిగించాలన్న రిక్వెస్టుకు దారితీస్తున్న కారణాలను ఈడీ ఇప్పటికే స్పెషల్ కోర్టుకు వివరించింది. ఇకపైన ఈడీ ఎలా వ్యవహరిస్తుందన్నదే ఢిల్లీ, తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలో హాట్ టాపిక్‌గా మారింది.
జాయింట్ ఎంక్వయిరీ ఇలా.. (ఈడీ వివరాల ప్రకారం)
మార్చి 17 : సిసోడియా, దినేశ్ అరోరా (పూర్తయింది)
మార్చి 17 : పిళ్లయ్, బుచ్చిబాబు (పూర్తయింది)
మార్చి 20 : సిసోడియా, రాహుల్ సింగ్
మార్చి 20 : సిసోడియా, అమిత్ అరోరా
మార్చి 20 : కవిత, పిళ్లయ్, బుచ్చిబాబు (ఈడీ ఆలోచన)
మార్చి 21 : సిసోడియా, సీ అరవింద్
త్వరలో : సిసోడియా, పిళ్లయ్