ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా.. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీలో జగిత్యాల ఎమ్మెల్యే చేరిక వ్యవహారం దుమారంగా మారింది.
దిశ, జగిత్యాల ప్రతినిధి : కాంగ్రెస్ సీనియర్ నేత గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. తన ప్రమేయం లేకుండా కనీసం సమాచారం అందించకుండా బిఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను పార్టీలో చేర్చుకోవడం పట్ల జీవన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం మంత్రి శ్రీధర్ బాబు,విప్ లు ధర్మపురి వేములవాడ ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ జీవన్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయి తొందరపడద్దని బుజ్జగించే ప్రయత్నం చేశారు.
హై కమాండ్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి కార్యకర్తలతో చర్చించిన అనంతరం సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఈ మేరకు జీవన్ రెడ్డి పదవికి రాజీనామా చేస్తున్నట్లు హైదరాబాద్‌లో ప్రకటించారు. తన ప్రమేయం లేకుండానే జరగాల్సింది జరిగిపోయిందని కాబట్టి రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని ప్రజా సమస్యలపై నియోజకవర్గంలోని పల్లెలను తిరుగుతానని అన్నారు. ఇదిలా ఉండగా బిజెపి నుంచి తనని ఎవరు సంప్రదించలేదని స్పష్టం చేశారు.