అమరుల కుటుంబాలంటే ఎందుకంత నిర్లక్ష్యం?: తెలంగాణ అమరవీరుల కుటుంబాల వేదిక
అమరుల కుటుంబాలంటే ఎందుకంత నిర్లక్ష్యమని తెలంగాణ అమరవీరుల కుటుంబాల వేదిక డిమాండ్ అధ్యక్షుడు జర్పుల నరేష్ ప్రశ్నించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: 12 వందల మంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అమరుల కుటుంబాలను ఎందుకు అంత నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారో అర్థం కావడంలేదని తెలంగాణ అమరవీరుల కుటుంబాల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జర్పుల నరేష్ నాయక్ ఆవేదన వ్యక్తంచేశారు. అమరులు స్వరాష్ట్ర సాధన కోసం త్యాగం చేసి తప్పు చేశారా అని ప్రశ్నించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నిర్మిస్తున్న అమరవీరుల స్థూపం ప్రారంభంలో అమరుల కుటుంబాలను పిలువకుండా కళాకారులతో ప్రారంభం చేయడం ఏమిటని ప్రశ్నించారు.
కేసీఆర్ వెంటనే స్పందించి అమరవీరుల కుటుంబాలను పిలిచి స్థూపం ప్రారంభోత్సవం నాడు అమరుల కుటుంబాలతో ప్రారంభం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని అమరుల కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. స్థూపంలో ప్రతి అమరుడి చరిత్ర తెలిసే విధంగా చేయాలని కోరారు. కార్యక్రమంలో అమరుల కుటుంబాల వేదిక సభ్యులు వెంకట్ రెడ్డి, ధన్ రాజ్, బి. సాయిబాబా, మహేష్ కుమార్, రాంబాబు, అమరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.