సీఎం కూడా అవుతానేమో.. జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఎన్నికల వేళ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి
దిశ, వెబ్డెస్క్: ఎన్నికల వేళ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు సీఎం అయ్యే అవకాశం రావొచ్చని వ్యాఖ్యానించారు. తాను ఏ పదవిని కోరుకోవడం లేదని, కానీ తాను సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. పదవులు వాటంతట అవే వస్తాయని, కానీ ఏ పదవి వచ్చినా కూడా తాను వద్దని చెప్పనని తెలిపారు. మంత్రిగా అన్ని శాఖలు నిర్వర్తించానని, అన్నింటిపై అనుభవం ఉందని స్పష్టం చేశారు. హఠాత్తుగా సీఎం అవకాశం రావొచ్చేమో అని ఆసక్తికర కామెంట్స్ చేశారు.
మంగళవారం నల్లగొండ జిల్లాలోని గుర్రంపోడులో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లో 55 ఏళ్ల నుంచి ఉన్నానని, 36 ఏళ్లకే మంత్రిగా అవకాశం దక్కిందని గుర్తు చేశారు. ఏమో.. తెలంగాణకు సీఎం కూడా అవుతానేమో అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్లో ఇప్పటికే సీఎం పదవి కోసం భారీ పోటీ నెలకొంది. ఎన్నికల్లో గెలవకమందే తామే సీఎం అని నేతలు ప్రకటించుకుంటున్నారు. దీంతో అధికార బీఆర్ఎస్ కూడా దీనిపై విమర్శలు కురిపిస్తోంది. కాంగ్రెస్లో సీఎం అభ్యర్థులు ఎక్కువమంది ఉన్నారని సెటైర్లు వేస్తోంది.