బిగ్ న్యూస్: ఆ నలుగురు నేతల దారెటు.. బీజేపీలో కంటిన్యూ అవుతారా.. కాంగ్రెస్‌లోకి జంప్ అవుతారా..?
బీజేపీలో కొనసాగుతున్న మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేశ్ వెంకటస్వామి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అసంతప్తితో ఉన్నట్టు తెలుస్తున్నది.
బీజేపీలో కొనసాగుతున్న మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేశ్ వెంకటస్వామి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అసంతప్తితో ఉన్నట్టు తెలుస్తున్నది. పార్టీలో ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం లభించడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్న వారు.. నెక్స్ట్ ఎటు వైపు అడుగులు వేస్తారనేది సస్పెన్స్‌గా మారింది. ఓ వైపు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందుతుండగా అటువైపు వెళ్తారా? లేక మాజీ ఎంపీ పొంగులేటితో కలిసి ప్రత్యేక వేదిక పంచుకుంటారా? అనేది ఉత్కంఠగా మారింది. వచ్చే నెలలో రాష్ట్ర రాజకీయాల్లో పలు మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరిన వలస నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆశించిన స్థాయిలో పార్టీలో ప్రాధాన్యం లభించలేదని ఆందోళన చెందుతున్నారు. పార్టీలో ఉంటూనే సంచలన కామెంట్స్ చేస్తున్నారు. రాష్ట్ర యూనిట్‌లో మార్పులు చేర్పులు లేకపోతే ఎదుగుదల కష్టమేనన్న అభిప్రాయాలను బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ వెళ్లి పార్టీ హైకమాండ్‌తోనూ సంప్రదింపులు జరుపుతున్నారు.
మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తదితరులంతా కాంగ్రెస్ గూటికి రావాలంటూ పీసీసీ చీఫ్ రేవంత్ ఓపెన్‌గానే పిలుపునిచ్చారు. మరి బీజేపీలో ఇమడలేక వీరంతా పార్టీ మారుతారా? లేక మాజీ ఎంపీ పొంగులేటితో కలిసి ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేసుకుంటారా? అనే చర్చలు రాష్ట్రంలో మొదలయ్యాయి.
కాంగ్రెస్‌లోకి ఆహ్వానం అంటూ రేవంత్ కామెంట్స్
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న, మొన్నటి వరకూ బీఆర్ఎస్‌తో కొనసాగి ఇటీవల విభేదాలతో పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అనుచరుల, అభిమానుల అభిప్రాయాలనూ తీసుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఏది బెస్ట్ అంటూ వారితో చర్చించినట్టు సమాచారం.
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత నిర్ణయం తీసుకుంటానంటూ గతంలో ప్రకటించిన ఆయన.. తాజాగా జూన్ సెకండాఫ్‌లో నిర్ణయం వెల్లడిస్తానని వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోనే బీజేపీలో కొనసాగుతున్న వివేక్, ఈటల, కొండా, రాజగోపాల్‌రెడ్డి లాంటి నేతలు అసంతృప్తితో ఉన్నారన్న భావనతో వారికి కాంగ్రెస్ ఆహ్వానం పలుకుతున్నదని, కలిసి పనిచేద్దామంటూ రేవంత్ కామెంట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. కానీ ఆ నలుగురు నేతలు రేవంత్ వ్యాఖ్యలపై స్పందించలేదు.
ఇబ్బందులు వాస్తవమేనన్న కొండా
బీజేపీలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నది నిజమేనంటూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. దిద్దుబాటు చర్యలు చేపట్టకుంటే పార్టీ ఎదుగుదల కష్టమేనని కామెంట్ చేశారు. ఆ నలుగురికి ఎవరి స్థాయిలో వారికి వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ వైరం, పరస్పర సహకారం, లోపాయకారీ ఒప్పందం తదితరాలపై సామాన్య జనంలో జరిగే చర్చల తరహాలోనే కమలనాథుల్లోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరంతా కేసీఆర్‌కు వ్యతిరేకంగా కొట్లాడాలనే పట్టుదల ఉన్నవారే కావడంతో వారికి తగిన వేదిక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని రేవంత్ పిలుపు ఇవ్వడం వారిని గుక్క తిప్పుకోకుండా చేసింది.
ప్రత్నామ్యాయ ప్లాట్‌ఫారం కోసం పొంగులేటి ప్రయత్నాలు?
కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర స్థాయిలో కలిసొచ్చే వ్యక్తులను కలుపుకుంటూ తగిన ప్రత్యామ్నాయ ప్లాట్‌ఫారం కోసం మాజీ ఎంపీ పొంగులేటి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సొంత జిల్లా ఖమ్మంతో మొదలుపెట్టి నల్లగొండ, రంగారెడ్డితో పాటు మాజీ మంత్రి జూపల్లి సహకారంతో మహబూబ్‌నగర్ జిల్లాల్లోని నేతలతో సంప్రదింపులు మొదలుపెట్టారు.
కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ నేత ద్వారా యాక్టివిటీని ప్రారంభించారు. జూన్ చివరి నాటికి బీజేపీలో ఉన్న వలస (అసంతృప్తి) నేతలతో ఆయన సమావేశమవుతారా? ఆల్టర్నేట్ ఫోర్స్‌గా తయారుకావడానికి తగిన ఏర్పాట్లు మొదలు పెడతారా? సొంత కుంపటి పెట్టుకోవడం ద్వారా ఓట్లు చీలి అంతిమంగా కేసీఆర్‌కే లాభం కలుగుతుందని ఆలోచిస్తారా? లేక రేవంత్ ఇచ్చిన ఆఫర్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇస్తారా? అనేని సస్పెన్స్‌గా మారింది.
రేవంత్ ఆఫర్‌తో చిక్కుల్లోకి ఆ నలుగురు
బీజేపీలో కంటిన్యూ అవుతున్న ఆ నలుగురు నేతల పేర్లను ప్రస్తావించిన రేవంత్.. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి, సహకారం ఇవ్వడానికి ముందుకు రావాలంటూ ఇచ్చిన పిలుపు వారిని ఇరకాటంలో పడేసింది. ఈ ఆఫర్ వచ్చిన సమయంలోనే కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఢిల్లీలో కామెంట్ చేయడం పలు అనుమానాలకు దారితీసింది.
బీఆర్ఎస్‌కు దీటైన ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని విశ్వసించిన ఆ నలుగురు కాషాయ కండువా కప్పుకున్నారు. కానీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోవడంతో కమలం పార్టీ డిఫెన్స్‌లో పడింది. అదే సమయంలో రేవంత్ కామెంట్స్ చేయడం, కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు వాటికి బలం చేకూర్చేలా ఉండటంతో రకరకాల ఊహాగానాలకు తావిచ్చినట్లయింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదారు నెలల సమయం ఉంది. ఈ టైంలో ఇలాంటి రాజకీయ కుదుపులు చోటుచేసుకోవడంతో రానున్న కాలంలో ఈక్వేషన్స్ ఎలాంటి షేప్ తీసుకుంటాయన్నది చర్చనీయాంశంగా మారింది. రేవంత్ ప్రస్తావించిన ఈ నలుగురు నేతలు మాత్రమే కాకుండా పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు బీఆర్ఎస్ టికెట్ ఈసారి అనుమానమే అనే ఆందోళనలో ఉన్న మరికొందరు కాంగ్రెస్‌కు దగ్గరవుతారా?.. లేక ప్రత్యామ్నాయ ప్లాట్‌ఫారం కొత్తగా ఉనికిలోకి వస్తుందా?.. కొత్త పార్టీ పెడితే కేసీఆర్ మొగ్గలోనే తుంచేసే ప్రయత్నం చేస్తారా?.. ఇలాంటి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నడుమ జూన్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో, వివిధ పార్టీల్లో ఏం జరగనున్నదనేది ఆసక్తికరంగా మారింది.
Read more: