నాలుగు కోట్ల ప్రజల సమస్య కాదు.. నలుగురి సమస్య : రేవంత్ రెడ్డి
కవితను ఈడీ విచారించడం సాధారణ విషయమే అని, ఇది కేవలం కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం అని రేవంత్ రెడ్డి అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించడం సాధారణ విషయమే అని, ఇది కేవలం కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పంపకాల్లో తేడాలు రావడంతోనే చిల్లర పంచాయతీలు బయటకు వచ్చాయన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన గతంలో కరోనా బారిన పడి అనారోగ్యంతో బాధపడుతున్న సోనియాగాంధీ మీదకు ఇదే కేంద్ర ప్రభుత్వం ఈడీని ప్రయోగించినప్పుడు కవిత, కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
సోనియాను ఇబ్బందులకు గురి చేస్తోందని ఈడీ కార్యాలయం ఎదుట తాము నిరసన వ్యక్తం చేస్తుంటే ఇదే కేసీఆర్ పోలీసులను పెట్టి మమ్మల్ని నియంత్రించాడని గుర్తుచేశారు. సోనియా గాంధీ విషయంలో మౌనం వహించి తమ వరకు వచ్చే సరికి సానుభూతి కోసం అర్రులు చాచితే సానుభూతి రాదన్నారు. కవితను ఈడీ విచారించడం తెలంగాణ సమస్యగా చిత్రీకరించాలని చూస్తున్నారని ఇది నాలుగు కోట్ల ప్రజల సమస్య కాదని నలుగురు కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన సమస్య అన్నారు. కవితను ఈడీ విచారించడాన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని ఆమె విచారణను ఎదుర్కోవాల్సిందే అన్నారు.