రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి మధ్య గ్యాప్‌కు అసలు రీజన్ ఇదేనా?

కొత్త ఇన్‌చార్జి వచ్చినా తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య సయోధ్య కుదిరినట్టు కనిపించడం లేదు. సీనియర్లు, జూనియర్ల మధ్య వార్ ఓ కొలిక్కి రావడం లేదు.

Update: 2023-02-17 11:06 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కొత్త ఇన్‌చార్జి వచ్చినా తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య సయోధ్య కుదిరినట్టు కనిపించడం లేదు. సీనియర్లు, జూనియర్ల మధ్య వార్ ఓ కొలిక్కి రావడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ శ్రేణులను నడిపించాల్సిన లీడర్లు తలో దారిలో వెళ్తుంటే కార్యకర్తలు కన్ఫ్యూజన్‌కు గురవుతున్నారు. నేతలను దారిలోకి తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఇటీవల ఇన్‌చార్జిని మార్చింది. మాణిక్కం ఠాగూర్‌ను తప్పించి మాణిక్ రావు థాక్రేను నియమించింది. ఇంత చేసినా రాష్ట్ర నేతల్లో మాత్రం అదే పొరపచ్చాలు కనిపిస్తుండటం హస్తం పార్టీ నేతల తీరుపై సొంత పార్టీలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రేవంత్ రెడ్డికి సీనియర్లకు మధ్య దూరం ఇంకా తగ్గడం లేదనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ అగాధంలా మారింది.

నిజానికి టీపీసీసీ పదవి తనకు దక్కకపోవడంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మొదట్లో అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగింది. కానీ ఆ తర్వాత తనకు ఎలాంటి పదవులు అక్కర్లేదని కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. అయినా రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం వెంకట్ రెడ్డి గుర్రుగానే ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికతో ఈ ఇద్దరు నేతల మధ్యా గ్యాప్ అమాంతం పెరిగిపోయింది. థాక్రే రాకతో అనూహ్యంగా వీరిద్ధరు భేటీ కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం వ్యక్తం అయింది. అయితే ఈ సంబరం ఆవిరవడానికి రోజుల వ్యవధికూడా పట్టలేదు. తాజాగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసిపోవాల్సిందే అంటూ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయగా.. పార్టీకి నష్టం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం మరోసారి వీరిద్ధరి మధ్య దూరం ఎంతలా ఉందో స్పష్టం చేస్తోందనే టాక్ వినిపిస్తోంది.

గ్యాప్‌కు అసలు రీజన్ ఇదేనా?:

ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డికి మధ్య ఇంతలా గ్యాప్ రావడానికి అసలు రీజన్ మరొకటి ఉందా అనే చర్చ కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వీరి మధ్య క్లాష్ రావడానికి టీడీపీయే కారణమా అనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. గతంలో రేవంత్ రెడ్డి టీడీపీలో కీలక పదవుల్లో పని చేసి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ కలిసి పోటీ చేశాయి. ఈ అంశంపై తాజాగా వెంకట్ రెడ్డి రియాక్ట్ అవుతూ తాను టీడీపీతో పొత్తు వద్దని గతంలోనే చెప్పానని కానీ నేషనల్ ఇంట్రెస్ట్ రీజన్‌తో అధిష్టానం ముందడుగు వేసిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీతో పొత్తు వద్దని ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి పదే పదే ప్రస్తావించారు.

అయితే వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు ఇలా ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం టీడీపీ ప్రజల పార్టీ అంటూ సాప్ట్ కార్నర్‌తో మాట్లాడుతున్నారు. ఈ పరిణామం రేవంత్ రెడ్డికి చంద్రబాబుకు మధ్య సంబంధాలను పదే పదే గుర్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో గతంలో టీడీపీలో కీలకంగా పని చేసిన వివిధ జిల్లాల నాయకులను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తూ అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడని గతంలో సీనియర్లు ఆరోపించారు. కోమటిరెడ్డితో సహా పలువురు సీనియర్లు రేవంత్‌కు వ్యతిరేకంగా మాట్లాడటానికి టీడీపీ విషయంలో రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న సానుకూల దృక్పథమే అసలు కారణం అనే చర్చ వినిపిస్తోంది. బీఆర్ఎస్‌ను ఓడించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నానంటున్న రేవంత్ రెడ్డి ఎన్నికల సమయానికి టీడీపీ విషయంలో ఎలా ముందుకు వెళ్తారనేది రాజకీయ వర్గాల్లో సస్పెన్స్‌గా మారింది.

Tags:    

Similar News