ఢిల్లీకి ‘బండి’.. ముగ్గురు కీలక నేతల చేరికపై క్లారిటీ కోసమేనా?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హుటాహుటిన హస్తినకు పయనమయ్యారు.
దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హుటాహుటిన హస్తినకు పయనమయ్యారు. పార్టీ హైకమాండ్ నుంచి అత్యవసర పిలుపు రావడంతో వెంటనే ఆయన బయలుదేరారు. తెలంగాణలో చేరికలు పెంచాలని జాతీయ నేతలు ఆదేశించారు. ఈ మేరకు కాషాయ నేతలు శరవేగంగా పావులు కదుపుతున్నారు. అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దని తెలంగాణ కాషాయ సారథి బండి సంజయ్ భావిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణరావును బీజేపీలోకి లాగాలని కమలదళం ప్లాన్ చేస్తోంది.
కాగా కాంగ్రెస్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేరిక దాదాపు కన్ఫమ్ అయినట్లు సమాచారం. ఇవ్వాళ సాయంత్రమే కాషాయతీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్‌లో ప్రభావితం చేయగలిగిన నేత. పొంగులేటి ఉమ్మడి ఖమ్మంలో తిరుగులేని నాయకుడిగా గుర్తింపుపొందారు. ఉమ్మడి మహబూబ్ నగర్‌పై జూపల్లి కృష్ణారావు తనదైన ముద్ర వేశారు. ఈ ముగ్గురు మూడు ఉమ్మడి జిల్లాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వారిని బీజేపీలోకి లాగితే పార్టీ మరింత బలోపేతమవుతుందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.
ఇదిలా ఉండగా ఇప్పటికే బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సైతం మంగళవారమే ఢిల్లీకి వెళ్లారు. పొంగులేటి, జూపల్లి పార్టీలో చేరితే వారికి ఎలాంటి భరోసా కల్పిస్తామనే అంశంపై ఇప్పటికే ఈటల రాజేందర్ హైకమాండ్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో వారు కూడా త్వరలోనే కాషాయతీర్థం పుచ్చుకుంటారని సమాచారం. జాయినింగ్‌తో పాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్ ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా వరంగల్ సీపీ రంగనాథ్‌పై కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు బండి సంజయ్ ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే వరంగల్ సీపీపై బండి ఫైల్ సిద్ధం చేసి పెట్టుకున్నారు. అరెస్టు చేసిన విధానంపై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయి.