కాంగ్రెస్‌ కు గుడ్ బైై! కమలం గూటికి కోమటిరెడ్డి బ్రదర్స్!

దిశ ప్రతినిధి, నల్లగొండ: కాంగ్రెస్ పార్టీకి కేరాఫ్ అడ్రస్‌గా

Update: 2022-03-16 02:40 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ: కాంగ్రెస్ పార్టీకి కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకొనే కోమటిరెడ్డి బ్రదర్స్.. కాషాయ బాట పట్టనున్నారా?. అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొన్న తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నేత వివేక్ వెంకటస్వామితో భేటీ అయితే.. అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏకంగా ప్రధాని మోడీనే కలిశారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఈ కీలక నేతలు వీలు చిక్కినప్పుడల్లా  బీజేపీ రాగం అందుకుంటుండటం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కోమటిరెడ్డి బ్రదర్స్ త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

కన్ఫ్యూజన్‌లో కాంగ్రెస్ శ్రేణులు..

కోమటిరెడ్డి బ్రదర్స్‌కు కాంగ్రెస్ పార్టీలో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రధానంగా నకిరేకల్, నల్లగొండ, మునుగోడు, భువనగిరి, ఆలేరు, ఇబ్రహీంపట్నం, జనగామ నియోజకవర్గాల్లో వీళ్లదే హవా అని చెప్పాలి. తాజాగా కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహరిస్తున్న తీరు కాంగ్రెస్ శ్రేణులను కన్ఫ్యూజన్‌లో పడేసింది. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పలుమార్లు తాను బీజేపీలో చేరనున్నట్టు బహిరంగంగానే ప్రకటించారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక సమయంలోనూ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి సాగర్ ఉపఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. తాజాగా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు ముందు రోజు బీజేపీ నేత వివేక్ వెంకటస్వామితో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భేటీ కావటం, ఆ తర్వాత ఎంపీ వెంకటరెడ్డి ప్రధాని మోడీని కలవడంతో కాంగ్రెస్ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రోజురోజూకూ బలహీనపడుతున్నందునే వెంకటరెడ్డి సైతం బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయినట్టు తెలిసింది. అందులో భాగంగానే ప్రధానిని కలిశారనే ప్రచారం జరుగుతున్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాని అపాయింట్‌మెంట్ కోరిన అర్ధగంటలోనే కన్‌ఫర్మ్ చేశారని సమాచారం. గతంలో సీఎం కేసీఆర్, తెలంగాణ మంత్రులు ఢిల్లీ వెళ్లి.. ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ కోసం రోజుల తరబడి ఎదురుచూసినా దొరకక పోవడం గమనార్హం. వెంకట్ రెడ్డికి ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వడం.. తెలంగాణ రాజకీయ పరిస్థితులపైన చర్చించడం వెనుక కారణాలు చర్చనీయాంశంగా మారాయి. త్వరలోనే బ్రదర్స్ ఇద్దరూ ప్రధాని మోదీ, అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డికి దక్కని మద్దతు..

అసెంబ్లీ సమావేశాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సభలో ఉన్న మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ రాజగోపాల్ రెడ్డికి అండగా నిలువలేదు. అయినా టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అన్నదమ్ములిద్దరూ హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే వివేక్ వెంకటస్వామి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా కంప్లీట్ చేశారని తెలుస్తోంది.

Tags:    

Similar News