జీవన్ రెడ్డి చేర్చుకుంటే తప్పులేదా..? మాజీ ఎమ్మెల్సీకి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కౌంటర్
ఆ సమయంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులను చేర్చుకోలేదా..? ఆయనకు ఒక న్యాయం వేరేవాళ్లకు ఒక న్యాయమా అని జగిత్యాల (Jagithyal) ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఆ సమయంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులను చేర్చుకోలేదా..? ఆయనకు ఒక న్యాయం వేరేవాళ్లకు ఒక న్యాయమా అని జగిత్యాల (Jagithyal) ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) అన్నారు. పేదలకు లబ్ది చేకూరే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని అమలు చేస్తుంది. ప్రజల్లో సన్న బియ్యంపై ఉన్న అపోహలను తొగించేందుకు ప్రజాప్రతినిధులు సన్నబియ్యం లబ్దిదారుల ఇంట్లో భోజనం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) పిలుపునిచ్చారు.
ఇందులో భాగంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల నియోజకవర్గంలోని ఓ రేషన్ కార్డు లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన కాంగ్రెస్ కండువా (Congress Towel) కప్పుకొని పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. అనంతరం మీడియాతో మాట్లాడిన సంజయ్ కుమార్.. సోమవారం కాంగ్రెస్ మాజీ ఎమ్మల్సీ జీవన్ రెడ్డి (Former MLC Jeevan Reddy) చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వం పఠిష్టంగా ఉండాలనేది సీఎం ఆలోచన అయితే.. నియోజకవర్గం అభివృద్ధి కావాలనేది తన ఆలోచన అని చెప్పారు. ఇక మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నానని, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని ఒడగొట్టిన తర్వాత ఎంపీగా పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ నాయకులను చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. నాకు అనుకూలంగా పని చేసిన బీఆర్ఎస్ సర్పంచులను, ఎంపీటీసీలను, డీసీసీ చైర్మన్లు సహా పలువురిని చేర్చుకోలేదా అని అన్నారు. మీరు జాయిన్ చేసుకుంటే తప్పు లేదు కానీ మిగిలిన వాళ్లు చేస్తే తప్పు అవుతుందా అని నిలదీశారు.
తాను ఇంకా సభ్యత్వం తీసుకోలేదని చెబుతూ.. నియోజకవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం (Congrtess Government)తో కలిసి పనిచేస్తే జీవన్ రెడ్డికి ఎందుకు అంత అసహనం అని సంజయ్ కుమార్ మండిపడ్డారు. కాగా సోమవారం ఓ కార్యక్రమంలో భాగంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్లు కాంగ్రెస్ కార్యకర్తలను వేధించి కేసులు పెట్టినోడు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ లో చేరాడని మండిపడ్డారు. అంతేగాక అధికారాన్ని అడ్డు పెట్టుకుని దౌర్జన్యాలు చేసి అధికారం పోగానే.. కాంగ్రెస్ కార్యకర్తల రాజ్యాధికారాన్ని ఛేజిక్కించుకుంటున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.