‘రాజీనామాలు’.. వైఎస్సార్సీపీని బలహీనపరచడానికి వేసిన ఎత్తుగడల్లో భాగమేనా..?
ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. రాజ్యసభ చైర్మన్‌కు సోమవారం రాజీనామా లేఖ సమర్పించగా మరుసటి రోజే ఆయన ఆమోదం తెలిపారు. ఇప్పటికే ఏపీ నుంచి ఎన్నికైన ఇద్దరు రాజ్యసభ ఎంపీలు (ఇద్దరూ వైఎస్సార్సీపీ నుంచే) బీదా మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ రిజైన్ చేయగా ఆ వరుసలో ఆర్.కృష్ణయ్య మూడో వ్యక్తి. దీంతో మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణకు చెందిన ఆర్.కృష్ణయ్య వైఎస్సార్సీపీ తరపున ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన తర్వాత బీసీలకు ఆయన దూరమయ్యారనే, తెలంగాణతోనూ గ్యాప్ పెరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరో నాలుగేండ్ల పదవీకాలం ఉన్నా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. బీజేపీలో చేరుతారా?.. తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెడతారా?.. బీసీల పేరుతో కొత్తగా రాజకీయ పార్టీని స్థాపిస్తారా..? రాజకీయాలకు దూరంగా ఉంటారా..? ఇలాంటి అనేక చర్చలు జరుగుతున్నాయి. భవిష్యత్ కార్యాచరణపై బుధవారం మీడియాకు పూర్తి వివరాలను వెల్లడించనున్నట్టు తెలిపారు.
వీహెచ్‌పీ, ఏబీవీపీతో సన్నిహిత సంబంధాలు
దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా బీసీ రాజకీయాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థి, యువజన ఉద్యమాలను నడిపిన ఆర్.కృష్ణయ్య స్వయంగా తనంతట తానుగానే పలు సందర్భాల్లో ఏబీవీపీతో సన్నిహిత సంబంధాలు ఉండేవని, భావజాలం రీత్యా విశ్వహిందూ పరిషత్‌తో ఏకీభవించేవాడినని తెలిపారు. వారం రోజుల క్రితం సైతం ఆయన బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు వచ్చాయి. మూడు రోజుల క్రితం బీసీలను ఐక్యం చేసేలా ఇప్పటికైనా ఒక రాజకీయ పార్టీ వస్తే బాగుంటుందని, గతంలో దాదాపు 15 మంది బీసీలు పొలిటికల్ పార్టీలు పెట్టినా సక్సెస్ కాలేకపోయారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీలో చేరడం ద్వారా తెలంగాణలోని బీసీలకు దూరమయ్యారని, కొన్ని బీసీ సంఘాలతో గ్యాప్ పెరిగిందనే ఆరోపణలూ ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు ఎంత బలంగా ఉన్నాయో రాజకీయాలకు దూరంగా ఉండి కేవలం బీసీలను ఒక్క తాటి మీదకు తెచ్చేందుకు ఉద్యమాన్ని నిర్వహించాలని కోరుకుంటున్నట్టు ఆయన సన్నిహితులు వ్యాఖ్యానించారు. సొంతంగా ఒక రాజకీయ పార్టీని పెట్టి నడిపించడం వయసురీత్యా, ఆర్థిక కారణాల రీత్యా సాధ్యం కాదనే వాదనా ఆయన అనుచరుల నుంచి వినిపిస్తున్నది.
కృష్ణయ్య రాజీనామా బీజేపీ వ్యూహమా?
తెలంగాణలో బీసీ ఫేస్‌ను ముఖ్యమంత్రిగా నిలబెట్టాలని బీజీపీ చాలాకాలంగా భావిస్తున్నది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా బీసీకే సీఎం పోస్టు ఇస్తామని స్వయంగా అమిత్ షా ప్రకటించారు. ఇలాంటి నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే బీసీ రాగాన్ని బీజేపీ అందుకున్నదని, అందులో భాగంగానే ఆర్.కృష్ణయ్యను వాడుకుంటున్నదనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రత్యక్షంగా బీజేపీలో చేరినా.. చేరకున్నా.. ఆయనను బీజేపీ బీసీ ఓటు బ్యాంకు కోసం వాడుకుంటుందని, ఆ ప్రకారమే ఇప్పుడు రాజీనామా చేయించిందనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ద్వారా ఎస్సీ ఓటు బ్యాంకును చీల్చిన బీజేపీ ఇప్పుడు దాదాపు సగభాగం ఉన్న ఓటర్లను ఆర్.కృష్ణయ్యకు ఉన్న బీసీ ఫేస్ ఇమేజ్ ద్వారా చీల్చి ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసే వ్యూహంలో భాగమే తాజాగా ఆయన రాజీనామా అంశమనే చర్చలు కూడా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తుండటంతో తెలంగాణలోని బీసీ సంఘాలు అసంతృప్తిగా ఉండటం, వైఎస్సార్సీపీ తరఫున ఆ పదవిని పొందినందున పొలిటికల్‌గానూ బీసీ సంఘాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నారన్న అనుమానమూ ఉన్నది.
వైఎస్సార్సీపీని బలహీనపరిచే ఎత్తుగడ?
వీటన్నింటి నేపథ్యంలో ఆర్.కృష్ణయ్య తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. రాజీనామా చేసిన వెంటనే కొద్దిమంది మీడియా ప్రతినిధులకు ఫోన్‌లో ఆయన వివరణ ఇస్తూ.. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని, తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి సమయాన్ని కేటాయిస్తానని క్లారిటీ ఇచ్చారు. కృష్ణయ్య వాదన ఇలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీని పూర్తిస్థాయిలో బలహీనం చేయడానికి రాజకీయంగా వేసిన ఎత్తుగడల్లో భాగమే తొలుత మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్‌రావు... దానికి కొనసాగింపుగా ఆర్.కృష్ణయ్య రాజీనామా ఎపిసోడ్ అనేది కూడా జరుగుతున్న చర్చ. కృష్ణయ్య రాజీనామాతో ఆ స్థానం తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమితో భర్తీ కానున్నది. రాజ్యసభలో 11 మంది వైఎస్సార్సీపీ బలం 8కి పడిపోయింది.