బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేసి మరి జోరుగా ఐపీఎల్ బెట్టింగ్

ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయో లేవో బెట్టింగ్ కూడా జోరందుకుంది.

Update: 2023-04-18 02:19 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయో లేవో బెట్టింగ్ కూడా జోరందుకుంది. నిన్న మొన్నటి వరకు మ్యాచ్‌ల వీక్షణం అంతా టీవీలకే పరిమితం కాగా, స్మార్ట్ ఫోన్లు వచ్చాక అరచేతిలోనే బెట్టింగ్ ప్రపంచం చేరిపోయింది. ఇక ఎలక్ట్రానిక్ పేమెంట్ అంతా ఫోన్‌లోనే కావడంతో గుట్టుచప్పుడు కాకుండానే బెట్టింగ్ మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించింది. ఐపీఎల్ మ్యాచ్‌లు ముగిస్తే కానీ బెట్టింగ్‌లో జరిగిన నష్టం బహిర్గతం కావడం లేదు. అదే సమయంలో ఐపీఎల్ మ్యాచ్ లు ఉన్నప్పుడు తమ దందాల కోసం బార్లు, హోటళ్లు, సినిమా హాళ్లలో బిగ్ స్ర్కీన్‌లో మ్యాచ్‌లు ప్రదర్శించడంతో అక్కడ కూడా బెట్టింగ్ జరుగుతూనే ఉంది.

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బోధన్, కామారెడ్డి, ఆర్మూర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి లాంటి పట్టణాలలో బార్లలో, హోటళ్లలో ఏర్పాటు చేసిన ప్రొజెక్టర్లు, బిగ్ స్ర్కీన్లు ఇప్పుడు గ్రామాల్లోని దాబాలకు చేరాయి. ప్రభుత్వం బెల్టు షాప్‌లకు, దాబాలకు అనుమతులు ఇవ్వకపోయినా ఆదాయం వచ్చే వనరు కావడంతో అటు ఆబ్కారీ శాఖ మామూళ్లు వచ్చే వ్యవహారం కావడంతో పోలీసుశాఖ పట్టించుకోకపోవడంతో బెట్టింగ్‌ల దందా కోసం ప్రొజెక్టర్లు, బిగ్ స్ర్కీన్‌లను ఏర్పాటు చేసి బహిరంగంగా ప్రోత్సహిస్తున్నారు. నిజామాబాద్, మహారాష్ట్ర సరిహద్దు రుద్రూర్‌ దాబాల్లో బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేసి బెట్టింగ్‌లు నిర్వహిస్తుండటం ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.

ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయో లేదో ఆన్ లైన్‌లో బెట్టింగ్ షురూ అయింది. అప్పటి వరకు క్యాసినో, వన్ డే, టెస్టు మ్యాచ్‌లపై బెట్టింగ్‌లు కాసిన వారు ఐపీఎల్ ప్రారంభం కావడంతో అంతా ఇటువైపు మళ్లారు. ఒకప్పుడు ఆన్ లైన్‌లో బెట్టింగ్ ఆడాలంటే ఒకరిద్దరికో తెలిసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆన్ లైన్ చెల్లింపుల కారణంగా లైన్ ఉందా అని అడిగితే చాలు ఎలక్ట్రానిక్ చెల్లింపులు చేయించుకుని ఆన్ లైన్‌లోనే ఐడీ క్రియేట్ చేసి అందజేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఐపీఎల్, ఇతర బెట్టింగ్‌ల కొరకు ముంబాయి, నాందేడ్, హైదరాబాద్ లాంటి మెట్రోపాలిత నగరాలకే చెందిన వారే ప్రధాన బూకీలుగా ఉండేవారు.

ఇప్పుడు మాత్రం నగరాలకు, పట్టణాలకు, మండలాలకు , గ్రామాలకు కూడా బూకీ వ్యవస్థ విస్తరించింది. బెట్టింగ్ లేని స్మార్ట్ ఫోన్ లేదంటే అతిశయోక్తి కాదు. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు కామారెడ్డి, పొరుగున ఉన్న బోధన్, ఆర్మూర్ లాంటి ప్రాంతాల్లో బెట్టింగ్ జోరుగా సాగుతుంది. గడిచిన ఏడాది వరకు ప్రతియేడాది పోలీసు శాఖ బెట్టింగ్ లపై నజర్ వేసింది. ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభమై క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతున్నా జిల్లాలో ఒక్క కేసు నమోదు కాకపోవడం విస్మయం కలిగిస్తుంది. గతంలో ఐడీ పార్టీలు, టాస్క్ ఫోర్స్ పోలీసులు బెట్టింగ్ లపై నజర్ వేసేవారు. ఇప్పుడు మాత్రం దానిని గురించి అడిగే వారే లేరు. ప్రతియేటా బెట్టింగ్‌లలో వందల కోట్లు చేతులు మారుతూ పిల్లల నుంచి పెద్దల వరకు బెట్టింగ్ వ్యసనంలో మునుగుతున్న ఇప్పుడు పట్టించుకునే వారే లేరు.

నిజామాబాద్ నగరంలో రైల్వేస్టేషన్ వద్ద ఉన్న ఖాదీ బండార్ ప్రాంతానికి చెందిన వ్యక్తి మళ్లీ బెట్టింగ్‌లో ఐడీలు క్రియేషన్ చేసి యువతకు లైన్ ఇస్తున్నట్లు సమాచారం. ఎల్లమ్మగుట్ట, రేడియో స్టేషన్, కంఠేశ్వర్, ఆర్ ఆర్ చౌరస్తా, ముజాహిద్ నగర్‌కు చెందిన వ్యక్తులు నిజామాబాద్‌లో బెట్టింగ్ బంగార్రాజులుగా చెలామణి అవుతున్నారు. నిన్నమొన్నటి వరకు క్యాసినో, రాయల్ డ్రాగన్ వంటి పేర్లతో ఉన్న బెట్టింగ్ దందాలు నిర్వహించిన వారు ఇప్పుడంతా ఐపీఎల్ బెట్టింగ్ నిర్వాహణలో బిజీగా ఉండడం విశేషం.

వారికి కొందరు అండగా ఉండడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌ల వారీగా నిఘా విభాగాల నుంచి తప్పిస్తామని పెద్ద ఎత్తున వసూళ్లు చేసి బెట్టింగ్ దందాను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల పట్టుబడిన కొందరిని తప్పిచడంతో వారు కూడా నమ్మకంగా ఐపీఎల్‌లో బెట్టింగ్‌లు కాస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ సెమీ ఫైనల్స్, ఫైనల్స్ వచ్చే సరికి బెట్టింగ్‌ల ద్వారా కోట్లు చేతులు మారడం ఖాయంగా ఉంది. ఉమ్మడి జిల్లాకు చెందిన పోలీసు బాసులు ఈ వ్యవహరంపై నజర్ వేయాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Tags:    

Similar News