ఇంటర్నెట్ షట్‌డౌన్..! వరుసగా 5వసారి అగ్రస్థానంలో..
ఇంటర్నెట్ షట్‌డౌన్ ఘటనలు ప్రపంచవ్యాప్తంగా పోల్చుకుంటే ఇండియాలోనే అధికం అని మరోసారి ఓ నివేదిక వెల్లడించింది.
దిశ, డైనమిక్ బ్యూరో : ఇంటర్నెట్ షట్‌డౌన్ ఘటనలు ప్రపంచవ్యాప్తంగా పోల్చుకుంటే ఇండియాలోనే అధికం అని మరోసారి ఓ నివేదిక వెల్లడించింది. 2022 సంవత్సరంలో ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు విధించిన దేశంగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది. దీనికి సంబంధించిన జాబితాను న్యూయార్క్‌కు చెందిన ఇంటర్నెట్ అడ్వకేసీ వాచ్‌డాగ్ యాక్సెస్ నౌ అనే సంస్థ విడుదల చేసింది.
ఈ జాబితాలో భారత్ వరుసగా 5వ సారి అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొంది. 35 దేశాల్లోని అధికారులు 187 ఇంటర్నెట్ షట్‌డౌన్‌లను ఏర్పాటు చేశారు. ఈ షట్‌డౌన్‌లలో 84 భారత్‌లోనే జరిగాయి. ఈ 84లో 49 సార్లు జమ్మూకాశ్మీర్‌లో జరిగాయని యాక్సెస్‌నౌ తన నివేదికలో వెల్లడించింది. ఫిబ్రవరిలో వరుసగా మూడు రోజులపాటు షట్‌డౌన్‌లు విధించింది. రాజస్థాన్‌లో 12 వేర్వేరు సందర్భాలలో షట్‌డౌన్‌లు విధించారు.
ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ 7 సార్లు షట్‌డౌన్‌లకు ఆదేశించింది. కాగా, మునుపటి నివేదికతో పోలిస్తే 2021లో భారత్‌లో 107 సార్లు ఇంటర్నెట్ షట్‌డౌన్‌లను విధించారని, అంటే 2021లో కంటే 2022లో షట్‌డౌన్‌ల సంఖ్య తక్కువగా ఉందని నివేదిక తెలిపింది. మరోవైపు, గతేడాది ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత కనీసం 22 సార్లు రష్యా సైన్యం ఇంటర్నెట్ యాక్సెస్‌ను తగ్గించింది. దీంతో, ఈ లిస్టులో రష్యా రెండో స్థానంలో నిలిచింది.