కాంగ్రెస్‌లో ఇంటర్నల్ సర్వే.. స్థానిక సంస్థలే టార్గెట్‌గా భారీ స్కెచ్!
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఏయే వర్గాలు కాంగ్రెస్‌కు మద్దతు పలికాయో గుర్తించేందుకు ఆ పార్టీ ఇంటర్నల్ సర్వే చేయనున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఏయే వర్గాలు కాంగ్రెస్‌కు మద్దతు పలికాయో గుర్తించేందుకు ఆ పార్టీ ఇంటర్నల్ సర్వే చేయనున్నది. ఇప్పటికే ప్రాథమిక డేటా సేకరించిన పార్టీ, రెండు రోజులపాటు అధ్యయనం నిర్వహించి ఓ రిపోర్టును తయారు చేయనున్నది. ఈ నివేదికను ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీకి సమర్పించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది కో ఆర్డినేటర్లను నియమించారు. ప్రతీ పార్లమెంట్ సెగ్మెంట్‌కు ముగ్గురు చొప్పున ఈ సర్వేను అనాలసిస్ చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికలపై సంపూర్ణంగా విశ్లేషించాలని కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ తీర్మానించింది. గురువారం గాంధీభవన్‌లో ఎలక్షన్ కమిటీ చైర్మన్ కలిలవాయి దిలీప్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్‌లో కమిటీ మెంబర్లు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఏఐసీసీ ఓబీసీ కో ఆర్డినేటర్ కత్తి వెంకటస్వామి, మాజీ మంత్రి పుష్పలీల, ఎక్స్ ఎమ్మెల్సీ రాములు నాయక్, వినోద్ రెడ్డి పాల్గొన్నారు.
గెలుపోటములపై అధ్యయనం..
రాష్ట్రవ్యాప్తంగా 17 పార్లమెంట్ సెగ్మెంట్‌ల వారీగా ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ గెలుపోటములపై అధ్యయనం చేయనున్నది. ఏయే నియోజకవర్గాల్లో ఏ మేరకు కాంగ్రెస్‌కు మద్దతు పలికారు? కాంగ్రెస్‌కు నమోదైన ఓట్ల శాతం ఎంత? తక్కువ పడిన నియోజకవర్గాలు ఏవీ? అందుకు గల కారణాలు ఏమిటి? అని ఈ కమిటీ సంపూర్ణంగా సర్వే చేయనున్నది. రాష్ట్రవ్యాప్తంగా బూత్‌ల వారీగా ఓటర్ జాబితాలను సేకరించనున్నారు. బూత్ ఏజెంట్ల పరిశీలన ద్వారా అభ్యర్థుల రిజల్ట్స్ ఎలా ఉండనున్నాయి? వంటి అంశాలను కూడా నమోదు చేయనున్నారు. ఇప్పటికే కామన్ డేటాను సేకరించినట్లు ఎలక్షన్ కమిటీ టీమ్ మెంబరు ఒకరు తెలిపారు. దాన్ని రెండు రోజుల్లో అనాలసిస్ చేసి నివేదికను తయారు చేయనున్నారు.
స్థానిక సంస్థలే లక్ష్యంగా..
ప్రాథమిక డేటా ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో 80 శాతం మంది ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్ వైపు నిలువగా, మెజార్టీ బీసీలు, ఓసీలు బీజేపీకి మద్దతు పలికినట్లు ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ అంచనా వేస్తున్నది. కానీ.. సంపూర్ణ రిపోర్టు తయారు చేస్తేనే కచ్చితత్వం తేలుతుందని మెంబర్లు అభిప్రాయానికి వచ్చారు. మరికొద్ది రోజుల్లో జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో ఆయా వర్గాల మద్దతును పొందాలని కమిటీ నిర్ణయం తీసుకున్నది. జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్న కమిటీ, ఆ లోపు కష్టపడిన నేతలకు పార్టీలో, ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఉన్నదని తీర్మానం చేశారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో సత్ఫలితాలు సాధించినట్లే, స్థానిక సంస్థల్లోనూ కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని కమిటీలో నిర్ణయించారు.