Inter Results: ఇంటర్ ఫలితాల వెల్లడిలో జాప్యం.. బోర్డు తీరుపై సర్వత్రా విమర్శలు
జవాబు పత్రాల ముల్యాంకనం, ఫలితాల వెల్లడిలో ఇంటర్ బోర్డు తీరుపై విమర్శలు వస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: జవాబు పత్రాల ముల్యాంకనం, ఫలితాల వెల్లడిలో ఇంటర్ బోర్డు తీరుపై విమర్శలు వస్తున్నాయి. జవాబు పత్రాలను ముందే డీకోడింగ్ చేసి, విద్యార్థుల మార్కులను ముందుగానే తెలుసుకొని అధికారిక ప్రక్రియను, ఫలితాల విశ్వసనీయతను దెబ్బతిసే విధంగా వ్యవహరిస్తున్నారని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంటర్మీడియెట్ పరీక్షలు ఒకే రోజు తేడాతో ప్రారంభమయ్యాయి. తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ లెక్కన చూస్తే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ ఇంటర్ ఫలితాలు ముందుగా వెల్లడికావాల్సి ఉంది. కానీ తెలంగాణలో మరో పది రోజులైతే కానీ ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యే పరిస్థితి కనిపించడంలేదు. జవాబుపత్రాల ముల్యాంకనంలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ఇంటర్ బోర్డు తీరును చాలా మంది తప్పుపడుతున్నారు. జవాబు పత్రాల గోప్యత అంతా పోయే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
గోప్యత, జవాబుదారీతనం లేకుండా..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2020 తరువాత ఇంటర్ ఫలితాల వెల్లడి వైఫల్యంతో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో అప్పుడు ఇంటర్ బోర్డు, ప్రభుత్వం తీరు, కంప్యూటర్ నిర్వహణ సంస్థపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఫలితాలు కాస్తా రాజకీయ దూమారానికి దారి తీశాయి. విద్యార్థుల ఆత్మహత్యలు జాతీయ స్థాయి అంశంగా మారింది. దీంతో ఆ నాటి నుంచి ఇంటర్ బోర్డు అధికారులు, నిబంధనలు, గోప్యత, జవాబుదారితనం, వాల్యుయేషన్ విధానం అన్నింటికీ నీళ్లొదిలారనే విమర్శలు ఉన్నాయి.
రెండుసార్లు వాల్యుయేన్!
విద్యార్థుల జవాబు పత్రాలను రెండు సార్లు వాల్యుయేషన్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. డీకోడింగ్ ద్వారా పరీక్ష ఫలితాలను మూడు వారాల ముందుగానే తెలుసుకుంటున్నారు. విద్యార్థి హాల్ టికెట్ నంబర్ ద్వారా ఇంటర్ బోర్డు అధికారులు ఫలితాలను చూసుకునే అవకాశం ఈ విధానంలో ఉంది. ఇక ఫలితాలు రాకముందే తమ పరపతి ద్వారా పలితాలను తెలుసుకోవచ్చు. ఏ విధంగా ఫెయిల్ అయ్యాడు? అన్ని సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు వచ్చి ఏదైన ఒక సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చాయా? 30–32 శాతం మార్కులు వచ్చిన విద్యార్థులు ఎంత మంది ఉన్నారు? అన్ని సబ్జెక్టుల్లో 90 శాతం అంత కంటే ఎక్కువగా వచ్చి ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ కావడం, లేదా అతి తక్కువ మార్కులు వచ్చిన వారిని గుర్తించి ఆ విద్యార్థుల జవాబు పత్రాలను మళ్లీ వాల్యుయేషన్ చేయిస్తున్నారు. వీటన్నింటినికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇవన్నీ చేయాలంటే, కనీసం రెండు వారాల సమయం పడుతుంది. దీంతో ఏపీ లో ఇంటర్ ఫలితాలు వచ్చినా.. తెలంగాణలో ఫలితాలు విడుదల కావడానికి మరో రెండు వారాలు పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇంకా వాల్యుయేషన్ సెంటర్లలో రెండో సారి వాల్యుయేషన్ పూర్తి కాలేదు. ఆ ప్రక్రియ పూర్తి అయితే కానీ విడుదలకు మార్గం సుగమం కాదు.
ఫలితాల శాతాన్ని పెంచేందుకే?
దేశంలో ఎక్కడా కూడా ఫలితాలకు ముందుగా జవాబు పత్రాలను డీకోడింగ్ చేయరు. కానీ తెలంగాణ ఇంటర్ బోర్డు లో జరుగుతున్నదని చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే జవాబుపత్రాల రీవాల్యుయేషన్ తో ఫలితాల శాతాన్ని పెంచే పనిలో పడ్డారని, ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియ అదేనని, అయితే దీనిని అధికారికంగా ఎక్కడా చెప్పడంలేదని నిపుణులు చెబుతున్నారు. పాస్ పర్సంటేజీ తక్కువగా ఉంటే విమర్శలు, విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకుంటారని, వీటన్నింటి కంటే ఫలితాల శాతాన్ని పెంచితే ఇవేవి ఉండవనే కోణంలో ఇంటర్ బోర్డు అధికారుల తీరు ఉందనే విమర్శలు విద్యా నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి.
ఫలితాల విశ్వసనీయతను దెబ్బతిస్తున్నారు
ఇంటర్ బోర్డు నిబంధనలను గాలికి వదిలేసి అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నది. దేశంలో ఎక్కడా జవాబు పత్రాలను ముందుగా డీకోడింగ్ చేయరు. ఇక్కడ మాత్రం ఆ విధంగా చేయడం సరికాదు. ఈ విధంగా చేస్తే ఫలితాల విశ్వసనీయత దెబ్బతింటుంది. - మధుసూదన్ రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ సంఘం అధ్యక్షుడు