గత ప్రభుత్వ హయాంలో నల్గొండ సాగునీటి ప్రాజెక్టులకు తీరని అన్యాయం : మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి

గత ప్రభుత్వ హయాంలో నల్గొండ సాగు నీటి ప్రాజెక్టులకు తీరని అన్యాయం జరిగిందని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు.

Update: 2024-01-12 14:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : గత ప్రభుత్వ హయాంలో నల్గొండ సాగు నీటి ప్రాజెక్టులకు తీరని అన్యాయం జరిగిందని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ సచివాలయంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. మెజారిటీ పనులు పూర్తయిన ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు పనులు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు ప్రాజెక్టు గురించి అసెంబ్లీలో మాట్లాడినా.. ఆనాటి ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నల్గొండ సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో ఉందని తెలిపారు.

జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను త్వరతగతిన పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా రైతాంగానికి సాగునీరు అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. రెండేళ్లలో నల్గొండ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ఉదయ సముద్రం బ్రహ్మణవెల్లెంల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కెనాల్స్‌తో పాటు, పెండింగ్ లో ఉన్న ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పనులను యుద్ధ ప్రతిపాదికన చేపట్టి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కాలువలను పూర్తి చేసినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం మెయింటెనెన్స్ కూడా చేయలేదని మండిపడ్డారు.

ఎస్ఎల్‌బీసీ కాలువలకు గత 10 ఏళ్ల నుంచి మొయింటెనెన్స్ లేకపోవడంతో చెట్లు, పూడిక పెరిగిందని.. వాటికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. బెడ్, సైడ్స్ లైనింగ్ పనులను ఈ సంవత్సరంలోనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు క్రింద మొదటి దశలో 50 వేల ఎకరాలకు, రెండవ దశలో మరో 50 వేల ఎకరాలకు భూసేకరణ చేపట్టడం, కాలువలను తవ్వే పనులను పూర్తి చేసి లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీళ్లు అందించేలా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా ఉదయ సముద్రం మొదటి దశ భూసేకరణకు సుమారు రూ.100 కోట్లు, పనులకు గాను మరో రూ.100 కోట్లను త్వరితగతిన విడుదల చేస్తామని అన్నారు. అధికారులు అవిశ్రాంతంగా శ్రమించి యేడాదిలో మొదటి దశను పూర్తి చేసి 50 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని మంత్రిలిద్దరూ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ సెక్రెటరీ రాహుల్ బొజ్జ, ఈఎన్‌సీ మురళీధర్ రావు, ఛీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్, డిప్యూటీ ఈఎన్సీ జనరల్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News