ఎమ్మెల్యేలపై కేసు నమోదు చేయాలి : ఇందిరా శోభన్
దళిత బంధులో కమీషన్లు తీసుకున్న ఎమ్మెల్యేలపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఇందిరాశోభన్ పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: దళిత బంధులో కమీషన్లు తీసుకున్న ఎమ్మెల్యేలపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఇందిరాశోభన్ పేర్కొన్నారు. కమీషన్లు తీసుకున్నోళ్ల జాబిత తన వద్ద ఉన్నదని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారని, దీన్ని హైకోర్టు సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దళితబంధులో జరుగుతోన్న అవినీతిపై సీఎం కేసీఆర్ హైకోర్టుకు లేఖ రాయాలని లేకపోతే ఏసీబీ డీజీకి చిట్టా వివరాలివ్వాలన్నారు. ఈ రెండు జరగకపోతే ఏసీబీ డీజీ సీఎం కేసీఆర్ కు నోటీసులివ్వాలన్నారు.
ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందని తెలిసినా ఎటువంటి చర్యలు తీసుకోని కేసీఆర్ కు ముఖ్యమంత్రి సీటులో కూర్చునే నైతికత లేదని విమర్శించారు.ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆర్టీఐ డేటా ప్రకారం దళిత జనాభా 50 వేలు మంది ఉండగా, 96 మందికి దళిత బంధు ఇచ్చారన్నారు. కానీ ఇచ్చిన 96 మందిలో 90 మంది అధికార పార్టీ కి చెందినోళ్లే ఉన్నట్లు తెలిపారు.ఇందులో ఎన్ఆర్ఐ ఐటీ ఉద్యోగులు కూడా ఉండటం ఆశ్చర్యం కలిగించిందన్నారు.దీంతో రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు కింద మంజూరైన యూనిట్లకు జీపీఎస్ తో ఎక్స్,వై కో–ఆర్డినేటర్లు వేసి లింక్అప్ చేయాలన్నారు.అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలను వెంటనే భర్తరఫ్ చేయాలన్నారు.