కుత్బుల్లాపూర్‌లో పెరిగిన ఓటింగ్.. ఎవరికి లాభం..?
ప్రశాంతంగా పోలింగ్ ముగి సింది.
దిశ, పేట్ బషీరాబాద్: ప్రశాంతంగా పోలింగ్ ముగి సింది. ఈవీఎం యంత్రాలలో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమైంది. ఆదివారం జరగనున్న కౌంటింగ్‌లో ఎవరు గెలుస్తారో తేలిపోనున్నది. అయితే పోటీ చేసిన ప్రధాన పార్టీ అభ్యర్థులు పోల్ అయినా ఓట్లలో ఎన్ని ఓట్లు వస్తాయి..? క్రితం సారి నమోదైన ఓటింగ్ సరళి.. ఈసారి నమోదైన పోలింగ్ తీరుపై లెక్కలు వేసుకుంటున్నారు.
ఈ క్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 2018 ఎన్నికల సమయంలో నమోదు అయిన ఓట్ల కన్నా ఈసారి జరిగిన ఎన్నికలలో ఓటింగ్ అధికంగా నమోదు అవ్వడంతో ఎంత మేర లాభం చేకూరుతుంది లేదా నష్టం చేకూరుతుంది అనే విషయంపై మాధ్యమాలలో చర్చించుకుంటున్నారు. పెరిగిన ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ అని కొందరు అంటుంటే.. కాదు కాదు అది ముమ్మాటికి అభివృద్ధి చూసి వేసిన ఓటిం గ్ అని మరికొందరు ధీమాగా చెప్పుకుంటున్నారు.
నాలుగు లక్షలకు పైగానే..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆరు లక్షల 99 వేల 130 ఓట్లు ఉన్నాయి. వీటిలో పురుష ఓట్లు 3 లక్షల 66 వేల 707 ఉండగా మహిళా ఓటర్లు 3 లక్షల 32 వేల 264 గా ఉన్నారు. ఇతరులు 159 గా తేలారు. వీటిలో పోలింగ్ జరిగిన రోజు ఈవీఎం యంత్రాలలో 3 లక్షల 99 వేల 852 ఓట్లు నమోదు అయ్యాయి. అదే విధంగా అర్హులు అయిన దివ్యాంగు లు, వృద్ధులలో 456 ఓటర్లు ఓటు హక్కును వినియో గించుకున్నారు. దీంతో నియోజకవర్గంలో మొత్తంగా 4 లక్షల 308 ఓట్లు పోలైనట్లు తెలుస్తుంది.
గతంలో కన్నా పెరిగిన ఓటింగ్
2018 ఎన్నికలలో ఈవీఎం యంత్రాలలో 2 లక్షల 88 వేల 909 ఓట్లు నమోదయ్యాయి. గురువారం జరిగిన ఎన్నికలలో ఆ సంఖ్య 3 లక్షల 99 వేల 852 ఓట్లు నమోదు అయ్యింది. దీంతో క్రితం సారి కన్నా ఈ దఫా ఎన్నికలలో 1 లక్ష 10 వేల 943 ఓట్లు అదనంగా పోల్ అయ్యాయి. ఈవీఎంల ద్వారా నమోదు అయిన పోలింగ్ 57.19 శాతం గా ఎన్నికల అధికారులు ప్రకటించారు. గతంలో జరిగిన ఎన్నికల కన్నా ఈసారి అదనంగా 1.23 శాతం ఓట్లు ఎక్కువగా నమోదయినట్లు తెలుస్తుంది. దీనికి పోస్టల్ ఓట్లు, ఓట్ ఫ్రమ్ హోం ద్వారా వచ్చిన ఓట్లు అదనం.
లాభమెవరికీ?
క్రితం శాసనసభ ఎన్నికల కన్నా ఈసారి పోలింగ్ పెరగడం పై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఓటింగ్ పెరిగింది కాబట్టి ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని బిజెపి, కాంగ్రెస్ నాయకులు చెబుతుంటే.. కచ్చితంగా కాదు నియోజకవర్గంలో జరిగిన వేలాది కోట్ల రూపాయల అభివృద్ధిని చూసి మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటానికి ఓట్లు వేశారని బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు తేల్చి చెప్తున్నారు. ఎవరికి వారు పైకి గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ గెలుపు పై కొంతమేర టెన్షన్ పడుతున్నట్లు అవగతం అవుతుంది. పోలింగ్ బూతుల వారిగా పోల్ అయిన ఓట్ల లెక్కలు తెప్పించుకొని గెలుపు పై ఉన్న అవకాశాలను బెరీజు వేసుకుంటున్నారు. మూడవ తారీకు జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ లో అభ్యర్థులు వేసుకున్న లెక్కలు సరైనవా..? కావా..? అనే విషయం తేలిపోనున్నది.