ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్‌కు 3,500 ‘ఇందిరమ్మ ఇండ్లు’

రాష్ట్రవ్యాప్తంగా మరో గ్యారంటీని అమలు చేయడానికి ప్రభుత్వం సమాయత్తమవుతున్నది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన ‘ఇందిరమ్మ ఇండ్లు’ స్కీమ్‌ను ఈ నెల 11న ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Update: 2024-03-02 16:29 GMT
ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్‌కు 3,500 ‘ఇందిరమ్మ ఇండ్లు’
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా మరో గ్యారంటీని అమలు చేయడానికి ప్రభుత్వం సమాయత్తమవుతున్నది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన ‘ఇందిరమ్మ ఇండ్లు’ స్కీమ్‌ను ఈ నెల 11న ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దశలవారీగా అమలయ్యే ఈ గ్యారంటీకి అవసరమైన మార్గదర్శకాలను, నియమ నిబంధనలను రూపొందించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శనివారం జరిగిన రివ్యూ మీటింగులో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు లోతుగా చర్చించారు. ఈ స్కీమ్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను సీఎం ఆదేశించారు.

ప్రజాపాలన ప్రోగ్రామ్‌లో భాగంగా అభయహస్తం ద్వారా దరఖాస్తు చేసుకున్నవారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నొక్కిచెప్పిన ముఖ్యమంత్రి... దశలవారీగా రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ ఈ సౌకర్యాన్ని అందేలా చూడాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్‌లో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున అందజేసేలా స్పష్టత ఇచ్చారు. సొంత జాగ ఉండి అందులో ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి ప్రభుత్వం నుంచి రూ. 5 లక్షల మేర ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు పేర్కొన్నారు. సొంత స్థలం, ఇంటి జాగా లేని నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వమే ఈ రెండింటినీ సమకూరుస్తుందని ఈ సమావేశంలో నిర్ణయం జరిగింది. నిధులు దుర్వినియోగం కాకు,డా పకడ్బందీ మెకానిజంతో పాటు స్పష్టమైన గైడ్‌లైన్స్ రూపొందించాలని ఆఫీసర్లకు సీఎం స్పష్టం చేశారు.

రాష్ట్రంలో సొంతిల్లు లేని నిరుపేద అర్హులందరికీ ఈ పథకా వర్తింపజేయాలని ముఖ్యమంత్రి నొక్కిచెప్పారు. అందుకు అనుగుణంగానే విధి విధానాల రూపకల్పన ఉండాలన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణంలో చేసిన తప్పులను దృష్టిలో పెట్టుకుని అలాంటివి ఈసారి రిపీట్ కాకుండా చూసుకోవాలన్నారు. నిజమైన అర్హులకు లబ్ధి జరిగేలా చూడాలని అధికారులను అప్రమత్తం చేశారు. తొలుత ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇళ్లను మంజూరు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నా దశల వారీగా గూడులేని నిరుపేదల సొంత ఇంటి కల నెరవేర్చడం ప్రభుత్వ సంకల్పమని సీఎం క్లారిటీ ఇచ్చారు. ఏ దశలో నిధులను ఏ తరహాలో విడుదల చేయాలో అధికారులు నిర్దిష్టమైన షెడ్యూలు తయారుచేసి దానికి అనుగుణంగానే నిబంధనలను సిద్ధం చేయాలన్నారు. నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన మార్గదర్శకాలు ఉండాలన్నారు.

సొంత స్థలం ఉన్న వారికి అక్కడ కొత్త ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇవ్వాలని, స్థలం లేని నిరుపేద కుటుంబాలకు స్థలంతో పాటు రూ.5 లక్షలు కూడా అందించేలా గైడ్‌లైన్స్ ఉండాలన్నారు. సొంత జాగాలో ఇల్లు కట్టుకోవడం వారి టేస్ట్, ప్లాన్ ప్రకారమే ఉంటుందని, కానీ ఆ డిజైన్‌లో తప్పనిసరిగా కిచెన్, టాయ్‌లెట్ ఉండి తీరాలన్నారు. వివిధ రకాల ఇంటి నమూనాలు, డిజైన్లను తయారు చేయించాలని అధికారులను సీఎం సూచించారు. ఇంటి నిర్మాణాలను పర్యవేక్షించే బాధ్యతను వివిధ శాఖల్లో ఉన్న ఇంజనీరింగ్ విభాగాలకు అప్పగించాలని, జిల్లా కలెక్టర్ల అధ్వర్యంలో ఇంజనీరింగ్ విభాగాలకు ఈ బాధ్యతలను ఇవ్వాలని చెప్పారు.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ పధాన కార్యదర్శి శాంతికుమారి, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News