మునుగోడులో కొత్త ప్రయోగాలు.. ఆ ఓట్లు ఏ ఖాతాలోకి..!!

మునుగోడు ఉప ఎన్నికలో కొత్త ప్రయోగాలు మొదలయ్యాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇదో సెమీస్‌గానే ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. అందుకే తమ సత్తాకు మించి బల నిరూపణకు దిగుతున్నాయి.

Update: 2022-10-21 00:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు ఉప ఎన్నికలో కొత్త ప్రయోగాలు మొదలయ్యాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇదో సెమీస్‌గానే ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. అందుకే తమ సత్తాకు మించి బల నిరూపణకు దిగుతున్నాయి. కానీ, ఇదే సమయంలో కొత్త పార్టీలు, సామాజిక అంశాలుగా ఓట్లను చీల్చుతున్నారు. మరోవైపు 39 ఏండ్లలోపు ఉన్న యూత్​మొత్తం అధికార పార్టీపై 80 శాతం అక్కసుతోనే ఉన్నాయి. దీనికి అదనంగా మాజీ ఐపీఎస్​అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్​నేతృత్వంలో కొన్ని వర్గాల ఓట్లను ప్రధానంగా పెట్టుకుని బీఎస్పీ బరిలోకి దిగింది. అటు గద్దర్‌ను పోటీకి నిలబెడుతున్నట్లు ప్రకటించిన కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ చివరకు పాల్ ఎన్నికల బరిలోకి దిగారు. ఉద్యమనేత, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం కూడా అభ్యర్థిని పోటీకి దింపారు. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీలు భారీగా ఆశలు పెట్టుకున్న బీసీ ఓట్లకు గండిపడే అవకాశాలు నెలకొన్నాయి. టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, అటు కాంగ్రెస్‌లో చేరిన తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్​రూపంలో ఓట్లు చీలుతాయని భావిస్తున్నారు. దీంతో ఓట్ల చీలిక ఎవరికి లాభం చేకూర్చుతుందో అంతు చిక్కడం లేదు. ఏ పార్టీకి లాభం చేస్తుందో కూడా అంచనా వేయలేకపోతున్నారు.

ప్రస్తుతం మునుగోడు రాజకీయాలు పీక్స్‌కు చేరుకున్నాయి. మునుగోడు ఉపఎన్నిక అన్ని ప్రధాన పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తేనే, భవిష్యత్తు ఎన్నికల్లో సత్తా చూపించే అవకాశం ఉంటుందని అన్ని పార్టీలు భావిస్తుండటంతో అక్కడి ఓటర్లపై అన్ని రాజకీయ పార్టీల ఫోకస్ పెంచాయి. అన్ని రాజకీయ పార్టీలు భవిష్యత్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ జెండా ఎగురవేయాలని ప్రయత్నం చేస్తున్నాయి. సామాజిక వర్గాల వారీగా ఓటర్ల జాబితాను సేకరించి కసరత్తులు మొదలు పెట్టాయి. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు సామాజిక వర్గాల వారీగా ఓటు బ్యాంకు వివరాలు సేకరించుకున్నారు. వారి మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలోనే చీలిక భయం పట్టుకుంది.

ఏ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు? ఎవరి ఓట్లు ఎక్కువ ప్రభావం చూపిస్తాయి? వంటి అనేక అంశాలపై అధ్యయనం చేశారు. బీసీల ఓట్లు ఎన్ని? ఎస్సీ, ఎస్టీల ఓటుబ్యాంకు ఎంత? ఏ కమ్యూనిటీకి నియోజకవర్గంలో ప్రాధాన్యత ఉంది? ఏ కమ్యూనిటీ మునుగోడులో నాయకత్వాన్ని నిర్ణయిస్తుందనే అనేక అంశాలపై అంచనాలు గట్టిగానే వేస్తున్నారు.

మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా గౌడ సామాజికవర్గానికి చెందిన ఓట్లున్నాయి. మొత్తం ఓట్లలో 15.94% ఓటు షేర్‌తో ఉన్నారు. ఆ తరువాత స్థానంలో ముదిరాజులు ఉన్నారు. ముదిరాజు ఓటు పర్సంటేజ్ 15.3 7 శాతంగా ఉంది. ఇక మూడో స్థానంలో ఎస్సీ (మాదిగ) కమ్యూనిటీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సామాజికవర్గం ఓట్లు శాతం 11.6 3 శాతంగా ఉండగా, ఎస్సీ మాల సామాజికవర్గం ఓట్లు 10 వేలకుపైగా ఉన్నాయి. దీంతో వీరి ఓట్లు కూడా కీలకమవుతున్నాయి. ఆ తర్వాత పద్మశాలి, యాదవ వర్గాల ఓట్లున్నాయి.

సామాజికంగానే చీలిక

ప్రస్తుతం బీఎస్పీ వైపు ఎస్సీ సామాజికవర్గం నుంచి ఓట్లు చీలుతాయని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా క్రిస్టియన్ల ఓట్లు కొంతైనా కేఏ పాల్ వైపు ఉంటాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు, యువత ఓట్లు కూడా అధికార పార్టీకి తక్కువగా నమోదయ్యే చాన్స్ ఉన్నట్లు గులాబీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటుగా మైనార్టీల ఓట్లు తమ గంపగుత్త ఓట్లుగా టీఆర్ఎస్ భరోసాతో ఉంది. కానీ, ఇప్పుడు ఆయా వర్గాల నుంచి ఒకే నినాదంతో అభ్యర్థులు పోటీకి దిగుతున్నారు. తెలంగాణ ఉద్యమ కారులు కూడా కొంతమంది కోదండరాంతో ఉండే చాన్స్​ కూడా ఉంది. దీంతో ఓట్లు చీలిపోవడం ఖాయంగా మారింది. ఈ పరిణామాలు ఎవరికి లాభం చేకూర్చుతాయనేది అన్ని పార్టీలోనూ భయం పుట్టిస్తోంది.

బూర, చెరుకు ప్రతాపం ఎంత?

మునుగోడు ఉప ఎన్నికకు ముందుగానే తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్​ వైపు తీసుకెళ్లారు. ఆ తర్వాత అనూహ్య పరిణామాల్లో బూర నర్సయ్య గౌడ్ టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీ గూటికి చేరారు. వీరిద్దరిదీ ఒకే సామాజికవర్గం. ఈ సెగ్మెంట్‌లోనూ ఈ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగానే ఉన్నాయి. అయితే, బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరిన నేపథ్యంలో అదే వర్గానికి చెందిన పల్లె రవిని టీఆర్ఎస్​వైపు తీసుకొచ్చారు. కానీ, పల్లె రవి నుంచి ఎన్ని ఓట్లు వస్తాయనేది టీఆర్ఎస్‌కు కూడా అంతుచిక్కకుండా మారింది. ఇదే సమయంలో బూర నర్సయ్య, చెరుకు సుధాకర్ కలిసి గౌడ సామాజికవర్గంలో ఓట్లను చీలిస్తే.. ఇది గులాబీ పార్టీకే ఇబ్బందిగా మారుతుందని అంచనా వేస్తున్నారు.

1.25 లక్షల మంది ఎటు

ఈ సెగ్మెంట్‌లో యువత ఓట్లు ఇప్పుడు విజయాన్ని తారుమారు చేసే స్థాయిలో ఉన్నాయి. 18 నుంచి 39 ఏండ్లలోపు వారి ఓట్లు 1.25 లక్షలుగా ఉన్నట్లు తేలింది. వీరు ఎటువైపు నిలుస్తారో పార్టీలకు అంతుచిక్కడం లేదు. రాష్ట్రంలో నిరుద్యోగ భృతి, నోటిఫికేషన్లపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో గులాబీకి మద్దతుగా ఉంటారా అనేది అనుమానంగానే మారింది. అటు బీజేపీ వైపు కూడా నిలుబడుతారా అనేది కూడా బహిరంగం కావడం లేదు. కాంగ్రెస్​వైపు ఇప్పుడు ఎవరు వెళ్తారో తెలియని ప్రశ్నగానే మారింది. ఈ నేపథ్యంలో మెజార్టీగా ఉన్న ఈ ఓట్లు ఎటువైపు నిలిస్తే.. వారిదే గెలుపు అని అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News