ధరణిలో తప్పుల్లేవంటే.. ముక్కు నేలకు రాస్తాం!
‘ధరణిలో ఉన్నది చిన్న చిన్న పొరపాట్లే.. వాటిని దిద్దుబాటు చేయొచ్చు.
'ధరణిలో ఉన్నది చిన్న చిన్న పొరపాట్లే.. వాటిని దిద్దుబాటు చేయొచ్చు. సాఫ్ట్‌వేర్‌తో వచ్చిన చిక్కులే.. అవి రెవెన్యూ వ్యవస్థకు చెందినవి కావు. వాటిని భూతద్దంలో పెట్టి చూడాలనుకోవడం మంచిది కాదు'
- అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ (09 ఫిబ్రవరి 2023న)
'ధరణి పోర్టల్ బ్రహ్మాండమని అసెంబ్లీలో మాట్లాడుతూ చప్పట్లు కొట్టించుకోవడం కాదు.! భూ న్యాయ శిబిరానికి వచ్చి స్వయంగా రైతుల బాధలు చూడాలి. వారి భూములకు సంబంధించిన గోడు ఏంటో తెలుసుకోవాలి. అప్పడు ధరణిలో సమస్యలు లేవని నిరూపిస్తే.. ముక్కు నేలకు రాస్తాం.! మరి మీరేం చేస్తారు..? ధరణిని రద్దు చేస్తారా..' అంటూ తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్దేశాయ్ కేతిరెడ్డి సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి సవాల్ విసిరారు. శనివారం రంగారెడ్డి జిల్లా యాచారంలో భూ న్యాయ శిబిరం నిర్వహిస్తున్నామని అక్కడికి రావాలని అసెంబ్లీలో ధరణిపై మాట్లాడిన సంబంధిత మంత్రులను కోరారు.
'' ధరణిలో ఒక్కసారి భూమి వివరాలు నమోదైతే అత్యంత సురక్షితంగా ఉంటాయి.. ట్యాంపరింగ్ చేసే వీల్లేకుండా ఉంది. ధరణి పాస్ బుక్ జేబులో ఉంటే భూమే తమ జేబులో భద్రంగా ఉన్నట్టు రైతులు భరోసాతో ఉన్నారు. కొందరు రైతుల భూముల వివరాలు తప్పుగా నమోదైనట్లు ప్రభుత్వం గుర్తించింది. అయితే.. 13 లక్షల దరఖాస్తులు రాగా 12 లక్షలు పరిష్కరించాం.
- అసెంబ్లీలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి.
దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీలో రెవెన్యూ పాలన, ధరణి పోర్టల్ అమలు ప్రస్తావనపై మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతులు మండిపడుతున్నారు. లక్షలాది మంది రైతులు భూ సమస్యలతో ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే కనిపించడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. అంతా బాగుంటే అన్ని లక్షల దరఖాస్తులు ఎందుకొచ్చినట్లో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఎందుకు పెట్టారో వివరించాలని.. సాంకేతిక సమస్యలంటూ కొట్టి పారేసిన మంత్రులను నిలదీస్తున్నారు.
ఎన్ఐసీ, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీలు ఉండగా టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్(గతంలో ఐఎల్ఎఫ్ఎస్టెక్నాలజీస్ లిమిటెడ్) అనే కంపెనీకి ఎందుకు కట్టబెట్టారు ? ఐటీలో ప్రపంచానికే పాఠాలు నేర్పిస్తున్న హైదరాబాద్‌లో ధరణి నిర్వహణకు సరైన కంపెనీ లేదా? ఊరు, పేరు, గుర్తింపు లేని కంపెనీకి కట్టబెట్టాల్సిన అగత్యమేమిటంటూ సోషల్ మీడియా వేదికగా ధరణి భూ బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన కంపెనీకి నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.
పెద్దల కోసమే..
రంగారెడ్డి జిల్లాలో వందలాది ఎకరాలను ప్రభుత్వం సేకరించని భూములకు ఎల్ఏజీ నంబర్లతో పీఓబీలో నమోదు చేశారు. కనీసం ఆ రైతులకు కనీస సమాచారం లేకుండానే పట్టాదారు కాలంమార్చేశారు. దీంతో తమ విలువైన భూములను సామాన్యులు కాపాడుకోలేని పరిస్థితి నెలకొంది. కొందరు అధికార, అంగ, ఆర్థిక బలంతో ముఠాలను పెట్టుకుని.. ఎల్ఏజీ నంబర్లతో నిషేధిత జాబితాలో చేర్చారో వాటినే కొనుగోలు చేస్తున్నారు. నయానో, భయానో వాటిని ఇవ్వకపోతే సామాన్యులకు దక్కవనే పరిస్థితులను కల్పిస్తున్నారు. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్డిస్ట్రిక్ట్ కు అత్యంత సమీపంలోని ఎల్ఏజీ పేరిట పెద్ద దందానే నడిచింది. గజం ధర రూ.లక్షల్లో పలుకుతుండగా వీటిని కొట్టేసేందుకే ఈ ఎల్ఏజీ నంబర్లతో అక్రమ నిషేధాన్ని అమలు చేసిన ఉదంతాలు అనేకం ఉన్నాయి.
పహాణీల్లోనే పేచీ..
రంగారెడ్డి జిల్లా శంషాబాద్, తలకొండపల్లి, శేరిలింగంపల్లి మండలాల్లో ఎల్ఏజీ 2200000009, 2200000010, 2200000018, 2100020721, 2100020713, 2100020691, 2100020675, 220000026, 2200000021, 2200000020.. ఇలా నంబర్లతో ఎంతోమంది రైతుల భూములను పీవోబీలో నమోదు చేశారు. వందలాది ఎకరాలపై అక్రమ నిషేధాజ్ఞలు పెట్టారు. ఇదేం సాంకేతిక వైఫల్యం కాదు. పెద్దలు కొనుగోలుకు మార్గాన్ని సుగమం చేసేందుకు అధికారులు ఆడిన నాటకమేనన్న ఆరోపణలూ ఉన్నాయి. అదే ధరణిలోని ప్రొహిబెటెడ్జాబితాలో మాత్రం ఈ సర్వే నంబర్లు లేవు. దాదాపు అన్ని సర్వే నంబర్ల క్లాసిఫికేషన్ పట్టా భూములుగానే ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం భూమిని సేకరించి ఉంటే అక్కడా అదే విధంగా ఉండాలి.