బావమరిదితో లీగల్ నోటీసు పంపితే.. మాట్లాడుడు బంద్ చేస్తా అనుకుంటున్నావా? : కేటీఆర్
బావమరిదితో లీగల్ నోటీసు పంపితే నీ ఇల్లీగల్ దందాల గురించి మాట్లాడుడు బంద్ చేస్తా అనుకుంటున్నావా ? అని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు.
దిశ, డైనమిక్ బ్యూరో: బావమరిదితో లీగల్ నోటీసు పంపితే నీ ఇల్లీగల్ దందాల గురించి మాట్లాడుడు బంద్ చేస్తా అనుకుంటున్నావా ? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోమన్నారు. ముఖ్యమంత్రి ఆయన డిపార్ట్మెంట్‌లోనే ఆయన బావమరిది శోద కంపెనీకి రూ. 1,137 కోట్ల టెండర్ కట్టబెట్టింది నిజమని స్పష్టం చేశారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్స్ 7, 11, 13 ని ముఖ్యమంత్రి ఉల్లంఘించిన మాట నిజమన్నారు. శోద అనే కంపెనీ గత రెండు ఏళ్లుగా రెండు కోట్లు మాత్రమే లాభం ఆర్జించిన ఒక చిన్న కంపెనీ అని తెలిపారు. ఢిల్లీలో ఉన్న నీ బీజేపీ దోస్తులు కూడా నిన్ను కాపాడడం కష్టమే.. అంటూ సెటైర్లు వేశారు.
ఈ దేశంలో న్యాయవ్యవస్థ బలంగా, నిజాయితీగా ఉన్నదన్నారు. నీకు ఆదర్శ్ కుంభకోణంలో అశోక్ చవాన్ లాగా, నువ్వు దొరికావు.. రాజీనామా తప్పదు.. అని కేటీఆర్ ట్వీట్ చేశారు. కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మున్సిపాలిటీల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూపొందించిన అమృత్ పథకంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అవినీతి చేశారని కేటీఆర్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి తన అధికారాన్ని ఉపయోగించి బావమరిది సృజన్ రెడ్డికి పనులు అప్పగించారని కేటీఆర్ ఆరోపించారు. అయితే అమృత్ పథకం టెండర్ల విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ సృజన్ రెడ్డి ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్‌కు లీగల్ నోటీసులు పంపారు. ఈ నోటీసులపై ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు.