బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే వారికి న్యాయం చేస్తాం: కేటీఆర్ ఫైర్ ట్వీట్!
ప్రజా పాలనలో ప్రజలకు మద్దతు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులతో నిర్బంధిస్తారా..? అని మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజా పాలనలో ప్రజలకు మద్దతు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులతో నిర్బంధిస్తారా..? అని మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేసిన ప్లాట్లలో నిర్మించుకుంటున్న ప్రజల ఇండ్లను మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఏమి ఆశించి నేడు కూలగొట్టించాడో ఒకసారి విచారణ చేపించండని సూచించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. రేవంత్‌కి అన్నగా ప్రచారం చేసుకుంటూ సుధీర్ రెడ్డి మేడ్చల్ అసెంబ్లీ పరిధిలో చేస్తున్న అరాచకాలపై ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకోవాని సూచించారు.
అమాయక ప్రజలకు ఈ ప్లాట్లు అమ్మింది కాంగ్రెస్ నాయకుడు రాందాస్ గౌడ్, మరో కాంగ్రెస్ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ కార్పొరేటర్ అమర్ సింగ్ కుటుంబం అని పేర్కొన్నారు. ఈ ప్లాట్లను 2008లో నాటి సీఎం రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్ధీకరించిందని గుర్తుచేశారు. గతంలో రెవెన్యూ అధికారులు ఇది పట్టా భూమిగా ఎన్వోసీ జారీ చేశారన్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి మున్సిపల్ అధికారుల అనుమతి తీసుకొని చాలా మంది ప్రజలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఇంటి నిర్మాణం చేసుకుంటున్నారని, కానీ సుధీర్ రెడ్డి అధికారులను వేధించి అమాయక ప్రజలు లక్షలు పోసి నిర్మించుకున్న ఇండ్లను ఈ రోజు కూలగొట్టించాడని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై కక్షగట్టి చేస్తున్న వేధింపులకు ప్రజలు ముగింపు పలకడం ఖాయమన్నారు. భవిష్యత్తులో తమ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ప్లాట్ ఓనర్లను న్యాయం చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు.
తమ బీఆర్ఎస్ పార్టీ మేయర్ జక్కా వెంకట్ రెడ్డిని, కార్పొరేటర్లను మీరు వేధిస్తున్నారని, తాము ఇలా వేధించాలి అనుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా పోయేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు మళ్ళీ వడ్డీతో సహా చెల్లిస్తాం. మా నాయకులను, మా మేయర్ ను, మా కార్పొరేటర్లను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఫైర్ అయ్యారు.