"నిన్ను వదలను, ఊచలు లెక్కపెట్టిస్తా".. 'కేటీఆర్' కు రామ్మోహన్ సవాల్!
‘‘మిస్టర్ కేటీఆర్..నువ్వు ఊచలు లెక్కపెట్టడం ఖాయం. నిన్ను వదిలిపెట్టేది లేదు. పదేళ్లలో ఇన్ని దారుణాలు చేస్తారా? మీ చీకటి సామ్రాజ్యంలో అక్రమాలకు అడ్డూ, అదుపు లేదు” అని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ ఆరోపించారు.
దిశ, వెబ్ డెస్క్: ‘‘మిస్టర్ కేటీఆర్..నువ్వు ఊచలు లెక్కపెట్టడం ఖాయం. నిన్ను వదిలిపెట్టేది లేదు. పదేళ్లలో ఇన్ని దారుణాలు చేస్తారా? మీ చీకటి సామ్రాజ్యంలో అక్రమాలకు అడ్డూ, అదుపు లేదు” అని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ ఆరోపించారు. గడిచిన పదేళ్లలో కేటీఆర్ చేసిన తప్పిదాలకు లెక్కలేదని, అన్నింటిని వెలికి తీసి ఊచలు లెక్కపెట్టిస్తామని ఆయన నొక్కి చెప్పారు. శుక్రవారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కంపెనీలు పుట్టకముందే ఒప్పందాలు చేసుకున్నారని సామా ఆరోపించారు. భువీ బయోకెమికల్స్, ధాత్రి కంపెనీలు పుట్టుకముందే కేటీఆర్ ఎంవోయూలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. జూన్ 10, 2022 లో తెలంగాణ రాష్ట్రం 3 సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకుందని, ఈ ఒప్పందాల విషయం కేటీఆర్ సైతం తన అధికారిక ట్విట్టర్ లో పోస్టు చేశారని గుర్తు చేశారు. భువి బయో కెమికల్స్ రూ.1040 కోట్లు, ధాత్రి బయో సిలికేట్స్ రూ.160 కోట్లు పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. కానీ ఎంవోయూ కుదిరిన సమయంలో ఇంకా ఆ కంపెనీలు పుట్టనే లేదన్నారు. ఇవి మచ్చుకు మాత్రమేనని తవ్విన కొద్ది.. బీఆర్ఎస్ తప్పిదాలు ఇంకా చాలా వస్తాయన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల హయంలో ఎన్ని ఎంవోయూలు జరిగాయి? వాటిలో ఎన్ని కంపెనీలు ఎప్పుడు పుట్టాయి? ఎంత పెట్టుబడులు వచ్చాయి? ఎంత మందికి ఉపాధి కల్పించారో చర్చకు సిద్ధమా కేటీఆర్..? అని సామ సవాల్ విసిరారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ ను ఇక వదిలే ప్రసక్తే లేదని, భోగస్ లన్నింటిని ఒక్కొక్కటిగా బయటకు తీస్తామన్నారు. దీంతో పాటు ఈ రెండు కంపెనీలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో 95 ఎకరాల జాగను కూడా ఇచ్చారన్నారు. పైగా రైతుల నుంచి గుంజుకొని మరి ఇచ్చారన్నారు. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లగా.. ఆ అలకేషన్ పై కోర్టు జోక్యంతో బ్రేక్ పడిందన్నారు. పదేళ్లలో జరిగిన అక్రమాలు, అవినీతి చూస్తుంటే దారుణాలు కనిపిస్తున్నాయన్నారు. బావ, బామ్మర్ధులు ఇద్దరూ బోగస్ ప్రచారాలు, మాటలతో బతుకుతున్నారని కేటీఆర్, హరీష్ రావును ఉద్దేశించి మండిపడ్డారు.
'కేటీఆర్ మెదడు' అరికాళ్లలో..
అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ మెదడు అరికాళ్లలోకి వెళ్లిందని సామా విమర్శించారు. నగరానికి నీటిని తరలించేందుకు సుంకేశులకు శంకుస్థాపన చేశామని కేటీఆర్ గొప్పగా చెబుతున్నారన్నారు. మంజీరా, కృష్ణా, గోదావరి నీళ్లు ఇప్పటికే వస్తున్నాయని, కానీ ఇది ఎవరి కోసం కట్టారో? కేటీఆర్ కే తెలియాలన్నారు. బోగస్ స్టేట్ మెంట్లతో కేటీఆర్, హరీశ్ రావు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా , వారి నైజం మాత్రం మారలేదని అన్నారు. వారిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ నీటి విషయంలో కేటీఆర్ నిస్సిగ్గుగా అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. మంజీరా, కృష్ణా, గోదావరి, ఎల్లంపల్లి నుంచి జలాలు నగరానికి తరలింపులో బీఆర్ఎస్ పాత్ర ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. పొద్దున లేస్తే బోగస్ ప్రచారాలు చేస్తున్నారని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్ సంగతి తాము చూసుకుంటామని వెల్లడించారు.
'జీవో ౩౩' పై హరీష్ పచ్చి అబద్దాలు..
ఇక మెడికల్ అడ్మిషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 33పై హరీశ్ రావు పచ్చి అబద్దాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ బిడ్డలకు మేలు జరగాలనే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని అన్నారు. ఈ 33 జీవో వల్ల 299 ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ బిడ్డలకు అదనంగా వస్తున్నాయని, ఈ విషయంలో హర్షించాల్సింది పోయి, ఏదో జరిగిపోతుందని అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉన్న నిబంధనను తొలగించి, 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఇక్కడ చదివిన వారిని స్థానికులుగా గుర్తిస్తున్నారని, దీని వల్ల రాష్ట్ర విద్యార్థులకు మోసం జరుగుతుందనడం అవాస్తవమన్నారు. పాత నిబంధన కారణంగా.. ఇతర ప్రాంతాల విద్యార్థులు 6 నుంచి 9వ తరగతి వరకు ప్రైవేట్ విద్యాసంస్థల నుంచి సర్టిఫికెట్లు తీసుకువచ్చి, స్థానికత పేరుతో తెలంగాణ బిడ్డలకు రావాల్సిన సీట్లు కొట్టేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు సామ రామ్మోహన్ రెడ్డి.