Ranganath: హైడ్రా బలి తీసుకుందని ప్రచారం చేయడం దురదృష్టకరం

సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో కూల్చివేతలు హైడ్రా చేపట్టలేదని, ఈ కూల్చివేతలకు హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.

Update: 2024-09-29 16:14 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో కూల్చివేతలు హైడ్రా చేపట్టలేదని, ఈ కూల్చివేతలకు హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సంగారెడ్డి కూల్చివేతలను హైడ్రాకు ముడిపెడుతూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావడం విచారకరమని అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రటనకలో తెలిపారు. హైడ్రా ఇలాంటి తప్పుడు వార్తలు ఖండిస్తోందన్నారు. హైడ్రాను అప్రతిష్ట పాలు చేయడానికి కొంతమంది చేస్తున్న ప్రయత్నాలను సామాజిక మాధ్యమాలు అనుసరించొద్దని విన్నవించారు. హైడ్రాకు సంబంధం లేని ఘటనలను ఆపాదిస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ అప్రతిష్టపాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంగారెడ్డి ఘటనలో హోంగార్డ్‌కి గాయమై చనిపోతే... హైడ్రా బలి తీసుకుందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడం దురదృష్టకరమన్నారు. అన్నీ కూల్చివేతలను హైడ్రాకు ముడి పెట్టవద్దని చెప్పారు. ఇటీవల కూకట్ పల్లి చెరువు పరిసరాల్లో ఇంటిని కూల్చి వేస్తారేమో అని బుచ్చమ్మ అనే మహిళా ఆత్మహత్య చేసుకోవడాన్ని కూడా హైడ్రాకు ఆపదించారని, ఆమెకు హైడ్రా నోటీసులు కూడా ఇవ్వలేదని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో కూల్చివేతలు జరిగిన హైడ్రాకు ఆపాదిస్తూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు వస్తున్నాయని, ఔటర్ రింగు రోడ్డు వరకే హైడ్రా పరిధి అనేది అందరూ గ్రహించాలని సూచించారు.


Similar News