HYDRA: బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తెస్తాం.. హైడ్రా కమిషనర్ రంగనాథ్
బతుకమ్మ కుంట పునరుద్ధరణకు హైడ్రా నడుం బిగించింది.
దిశ, తెలంగాణ బ్యూరో: బతుకమ్మ కుంట పునరుద్ధరణకు హైడ్రా నడుం బిగించింది. స్థానికుల సహకారంతో చేయాలని ఆ సంస్థ నిర్ణయించింది. అందుకు పూర్తి సహకారం ఉంటుందని స్థానికులు వెల్లడించారు. అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటను బుధవారం రెవెన్యూ అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సందర్శించారు. బతుకమ్మ కుంట పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరగాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కుంట పునరుద్ధరణ సందర్భంగా వీకర్ సెక్షన్ కాలనీలోని ఏ ఒక్క ఇంటిని కూల్చబోమని హైడ్రా కమిషనర్ భరోసా ఇచ్చారు. బతుకమ్మ కుంట చెరువుతో వరద ముప్పు తప్పి ఆహ్లాదకరమైన వాతావరణం వస్తుందని కమిషనర్ చెప్పారు.
ఎవరైనా హైడ్రా పేరు చెప్పి.. మోసాలకు పాల్పడితే నమ్మవద్దని హితవు పలికారు. హైడ్రా కమిషనర్ హామీతో వీకేర్ సెక్షన్ కాలనీ వాసులతో పాటు చుట్టూ ఇళ్లు ఉన్న నివాసితులు ఊపిరి పీల్చుకున్నారు. హైడ్రా చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అక్కడ నివాసం ఉంటున్న వారికి ఎలాంటి ముప్పు లేకుండా చెరువు తవ్వకానికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఒకప్పటి ఎర్రకుంటనే.. కాలక్రమంలో బతుకమ్మ కుంటగా మారిందన్న స్థానికులు రెవెన్యూ రికార్డులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. బతుకమ్మకుంటలో చెత్త, నిర్మాణ వ్యర్థాలు పోయడంతో చెరువు ఆనవాళ్లు కోల్పోయిందని స్థానికులు చెబుతున్నారు.
కబ్జాల చెర నుంచి చెరువును కాపాడాలని నిర్ణయించిన హైడ్రాకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు బతుకమ్మ కుంట పునరుద్ధరణ పనులను వేగవంతం చేస్తామన్నారు. బతుకమ్మ కుంట చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టాలని హైడ్రా నిర్ణయించింది. బతుకమ్మ కుంటలో నీటితో కళకళలాడితే పరిసర ప్రాంతల్లో పర్యావరణం, భూగర్భ జలాల పెరుగుదలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని కమిషనర్ పేర్కొన్నారు. కుంట పునరుద్ధరణ పనులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా సహకరిస్తామని స్థానికులు ప్రకటించారు.
బతుకమ్మ కుంట విస్తీర్ణం..
అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట 1962-63 లెక్కల ప్రకారం సర్వే నెం.563లో మొత్తం 14.06 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. బఫర్ జోన్‌తో కలిపి మొత్తం వైశాల్యం 16.13 ఎకరాల విస్తీర్ణంలో ఉందని సర్వే అధికారులు తేల్చారు. తాజా సర్వే ప్రకారం అక్కడ మిగిలిన భూమి 5.15 ఎకరాల విస్తీర్ణం మాత్రమే ప్రస్తుతం మిగిలి ఉన్న 5.15 ఎకరాల విస్తీర్ణంలోనే బతుకమ్మ కుంటను పునరుద్ధరించేందుకు హైడ్రా చర్యలు ప్రారంభించింది.
సార్ భరోసానిచ్చారు.. సంతోషంగా ఉంది: స్థానికులు
వీకర్ సెక్షన్ కాలనీలో 50 ఏళ్లుగా ఉంటున్నాం. హైడ్రా వస్తుందంటేనే భయాందోళనలకు గురయ్యాం. బతుకమ్మ కుంట పునరుద్ధరణలో మా ఇండ్లను కూలుస్తారని భయపడ్డాం. కానీ, ఇండ్లకు ఏలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని సార్ మాకు భరోసానిచ్చారు. ఆయన మాటలు విన్నాక మాకు సంతోషం అనిపించింది. కుంటను బాగు చేయడానికి మేమంతా సహకరిస్తామ స్థానికులు అరుణ, సుంకమ్మ, తిరుపతమ్మ, మహేష్, జి.రాములు ప్రకటించారు. బతుకమ్మ కుంట పునరుద్ధరణకు హైడ్రా చర్యలు తీసుకోవడం సంతోషకరమని పీసీసీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ అన్నారు.
తార్నాకలోని ఎర్రకుంట చెరువును సందర్శించిన రంగనాథ్
తార్నాకలోని ఎర్రకుంటను హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం సందర్శించారు. ఎలాంటి వివాదాలు లేని ఎర్రకుంటను పునరుద్ధరించాలంటూ నాగార్జున కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైడ్రాను కోరారు. 5.9 ఎకరాల్లో విస్తరించిన చెరువును పునరుద్ధరించి, సుందరీకరిస్తే ఇక్కడ దుర్వాసన, దోమల బెడద తప్పుతుందని స్థానికులు కోరారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు ఎర్రకుంటను పరిశీలించిన కమిషనర్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు.