అనుమతి కోరాం...రావద్దని ఆదేశించాం...సంధ్య థియేటర్ యాజమాన్యం
సంధ్య థియేటర్ 70ఎంఎం లో పుష్పా-2 ప్రీమియర్ షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాట వివాదంలో రోజుకో కొత్త ట్విస్టు వెలుగులోకి వస్తుంది.
దిశ, సిటీక్రైం : సంధ్య థియేటర్ 70ఎంఎం లో పుష్పా-2 ప్రీమియర్ షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాట వివాదంలో రోజుకో కొత్త ట్విస్టు వెలుగులోకి వస్తుంది. ఈ సంఘటన పై చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే టాలీవుడ్ సినీ నటుడు అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యం , ఇంకా కొందరిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే 4వ తేదీన ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ తో పాటు చిత్ర యూనిట్ అందరూ వస్తున్నారని సంధ్య థియేటర్ యాజమాన్యం వారి లెటర్ హెడ్ పై 2వ తేదీన సమాచారం ఇచ్చిన కాపీ అల్లు అర్జున్ అరెస్టు సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అదే విధంగా నాంపల్లి కోర్టు తో పాటు హై- కోర్టులో కూడా ప్రధానంగా ఈ అనుమతికి సంబంధించి అంశం పై రెండు వైపు న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. ఆ సమయంలో తాము అనుమతి కోరామని సంధ్య థియేటర్ యాజమాన్యం, తాము నిరాకరించామని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ ప్రక్రియ సరైన విధంగా జరగలేదని అటు పోలీసులు, ఇటు సంధ్య థియేటర్ యాజమాన్యం పరస్పరం తమ వాదనలను న్యాయమూర్తి వినిపించారు. తాజాగా చిక్కడిపల్లి పోలీసులు ప్రీమియర్ షోకు హిరో తో పాటు, చిత్ర యూనిట్ డిసెంబర్ 4 వ తేదీ రోజు రావద్దని తెలియజేయాలని సంధ్య థియేటర్ యాజమాన్యానికి లేఖ రాశారు. ఈ లేఖను థియేటర్ యాజమాన్యం స్వీకరించినట్లు సంతకం చేసిన కాపీ సోమవారం బయటికి వచ్చింది.
పోలీసులు రాసిన లేఖలో....
ఈ థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని హోటల్స్, రెస్టారెంట్ కు ఆనుకుని ఉంది. ఒకే ప్రాంగణంలో సంధ్య 70, సంధ్య 35 ఎంఎం థియేటర్స్ ఉన్నాయి. ఈ రెండింటికీ ఒకే ఎంట్రీ, ఎగ్జిట్ ఉంది. కొత్త సినిమాల విడుదల, ప్రీమియర్ షోలకు సెలబ్రిటీలు వస్తే ఫ్యాన్స్ ను, అభిమానులకు కంట్రోల్ సాధ్యం కాదు. అందులో ఈ ధియేటర్ లో సింగిల్ ఎంట్రీ ఉండటంతో చాలా ఇబ్బందికరం.ఈ నేపథ్యంలో సంధ్య థియేటర్ యాజమాన్యానికి డిసెంబర్ 4 తేదీ రోజు చిత్ర బృందానికి సమాచారం అందించి వారు స్పెషల్ షోకు రావద్దని తెలపాలని ఆదేశించారు.
లేఖల వార్ పై ఆధారాలు తేలాల్సిందే--
సినీ నటుడు అల్లు అర్జున్, చిత్ర బృందం ప్రీమియర్ షోకు వస్తున్నారని, బందోబస్తు కల్పించాలని అనుమతి సమాచారాన్ని సోలీసులకు ఇచ్చామంటున్న సంధ్య థియేటర్ యాజమాన్యం, రావద్దని సమాచారం ఇచ్చామని లేఖ రాశామని అంటున్న పోలీసుల వాదనల నేపథ్యంలో ఇప్పుడు దీని ప్రక్రియ ఎలా సాగిందనేది ఆసక్తిగా మారింది. ఈ లేఖలను తీసుకువెళ్ళింది ఎవరు, ఎవరికి అందించారు, అందిన లేఖ ల సమాచారాన్ని థియేటర్ సిబ్బంది, పోలీసు సిబ్బంది ముందుగా ఎవరికి చెప్పారు. చెప్పినా నిర్లక్ష్యం ఎందుకు చోటు చేసుకుంది.
రావద్దనే సమాచారం ఉండి అల్లు అర్జున్ , చిత్రం యూనిట్ వస్తే మాత్రం వారందరూ కూడా పోలీసులు మోపిన అభియోగం కింద చట్టపరంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. మరోవైపు పోలీసులు రాసిన లేఖ ను అందించే ప్రక్రీయలో ఏదైనా లోపాలు వెలుగు చూస్తే పోలీసు అధికారులు కూడా ఈ సంఘటనకు బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడనుందని వైరల్ అవుతున్న లేఖ లను బట్టి అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి సినీ నటుడు అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యం మధ్యంతర బెయిల్ మీద ఉన్న విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటలో గాయాలకు గురైన శ్రీ తేజ ఇంకా అత్యవసర వైద్య సేవలను పొందుతుండగా అతని తల్లి రేవతి మరణించిన విషయం అందరికి తెలిసిందే.