అలంకారప్రాయంగా వాటర్ ఏటీఎం లు..

అసలే ఎండలు మండి పోతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి పనుల నిమిత్తం వచ్చే బాటసారులు వేసవిలో దాహార్తితో అల్లాడుతుంటారు.

Update: 2023-04-17 10:27 GMT

దిశ, మియాపూర్ : అసలే ఎండలు మండి పోతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి పనుల నిమిత్తం వచ్చే బాటసారులు వేసవిలో దాహార్తితో అల్లాడుతుంటారు. అలాంటి వారికి స్వచ్ఛమైన తాగునీటిని తక్కువ ధరకే అందించేందుకు ఐదేళ్ల క్రితం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేసింది. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడానికి ఏర్పాటు చేసిన వాటర్ ఏటీఎంలు ప్రస్తుతం అలంకార ప్రాయంగా మారాయి. వాటర్ ఏటీఎంల ప్రారంభ సమయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కనబరిచిన హడావుడి ఆ తరువాత కనబరచడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏటీఎంల నిర్వహణ చూసేనాథులే కరువయ్యారని దుమ్ము, ధూళి, గ్లాసులు తుప్పు పట్టి అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నా పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒక్కో ఏటీఎమ్ కు లక్షల్లో ఖర్చు ..

చందానగర్ జీహెచ్ఎంసీ సర్కిల్-21 కార్యాలయం వద్ద సర్వీస్ రోడ్డులో ఓ ఏటీఎంను ఏర్పాటు చేయగా చందానగర్ లోని పీజేఆర్ స్టేడియం వద్ద మరో ఏటీఎంను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ఏటీఎంకు లక్షల రూపాయలు వెచ్చించారు. అదేవిధంగా చందానగర్ డివిజన్ పరిధిలోని రెడ్డికాలనీ, శుభోదయ కాలనీల్లో వాటర్ ఏటీఎంలను ఏర్పాటుచేసి నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో గతకొన్ని రోజుల క్రితం వాటిని తొలగించారు. సరైన ప్రణాళిక లేకుండా ఏటీఎంలను ఏర్పాటు చేసి నిర్వహణ గాలికి వదిలేయడంతో లక్షల రూపాయల ప్రజాధనం వృధా అవుతోందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.

నిర్వహణ లోపంతో ప్రజాధనం వృధా..

జీహెచ్ఎంసీ, జలమండలి సంయుక్త ఆధ్వర్యంలో వాటర్ ఏటీఎం సెంటర్లు ఏర్పాటు చేశారు. స్వీడన్ దేశానికి చెందిన జోసెఫ్ బీ ఎకాలజికల్ వాటర్ సొల్యూషన్ సంస్థ సహకారంతో ఏటీఎం సెంటర్లను ఏర్పాటు చేశారు. వాటర్ ఏటీఎం సెంటర్ల వద్ద ఒక్క రూపాయికి అరలీటరు, రెండు రూపాయలకు లీటరు. ఐదు రూపాయలకు ఐదు లీటర్లు, పది రూపాయలకు 20 లీటర్ల స్వచ్ఛమైన తాగు నీటిని ఈ ఏటీఎంల ద్వారా పొందవచ్చు.. అయితే నిర్వహణ లోపంతో ఈ ఏటీఎంలు పూర్తిగా నిరుపయోగంగా మారాయి. ఏటీఎంలలో ఎప్పుడు నీరు ఉంటుందో తెలియని పరిస్థితి దీంతో ఆదరణ లేక వెలవెలబోతున్నాయి. ఇప్పటికైన సంభందిత అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News