రేపటి నుంచి యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ పరీక్షలు
యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి అధికారులను ఆదేశించారు.
దిశ, హైదరాబాద్ బ్యూరో : యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి అధికారులను ఆదేశించారు. ఆదివారం నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు శనివారం డిఆర్ఓ ఛాంబర్ లో యూపీఎస్సీ డైరెక్టర్ మనోజ్ దేహురీ తో కలిసి లోకల్ ఇన్స్పెక్టింగ్ అధికారులు, రెవెన్యూ సూపర్వైసర్ లు, రూట్ ఆఫీసర్స్, పరీక్ష నిర్వహణ అధికారులతో యూపీఎస్సీ ఏర్పాట్ల పై నిర్వహించిన కో ఆర్డినేషన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూపీఎస్సీ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ పరీక్షలను ప్రశాంతంగా జరిగేలా చూడాలని అన్నారు.
పరీక్షల కోసం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని టిజేఎస్ పిడిసిఎల్ ను, తగినన్ని బస్సులు ఏర్పాటు చేయాలని టిఎస్ ఆర్టిసి ని, వైద్య సదుపాయాలు , ఏఎన్ఎమ్ ,ఫస్ట్ ఎయిడ్ మెడికల్ కిట్ ను, శానిటేషన్ ఏర్పాటు చేయాలని డి ఎమ్ అండ్ హెచ్ఓ ను ఆయన ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద జామర్ ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 2.30 గంటల నుంచి 5.30 వరకు రెండు షిఫ్ట్ లలో జరుగుతాయని అన్నారు. మొత్తం 222 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి 30 నిముషాలు ముందే చేరుకోవాలని సూచించారు. సెల్ ఫోన్స్, క్యాలిక్యులేటర్ తో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని తెలిపారు.
ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని ఆయన కోరారు. ఒరిజినల్ హాల్ టికెట్, గుర్తింపు కార్డు వెంట ఉంచుకోవాలని, నాంపల్లి లోని ఇందిరా ప్రియదర్శిని మహిళా డిగ్రీ కళాశాలలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. యూపీఎస్సీ నిబంధన మేరకు పరీక్ష కేంద్రం వద్ద క్లాక్ రూమ్ ఉండదని, అభ్యర్థులు ఎవరు కూడా బ్యాగులు, సెల్ ఫోన్లు, ఏలాంటి వస్తువులు పరీక్ష కేంద్రానికి తీసుకురాకుడదన్నారు. ఈ సమావేశంలో జిహెచ్ఎంసి, వైద్యశాఖ, ఆర్టీసీ, శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.