'గ్లకోమా'పై అవగాహన కలిగి ఉండాలి : సజ్జనార్
'గ్లకోమా'పై అవగాహన కలిగి ఉండాలని తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, మాజీ ఏడీజీపీ వీసీ సజ్జనార్ తెలిపారు.
దిశ, ఖైరతాబాద్ : 'గ్లకోమా'పై అవగాహన కలిగి ఉండాలని తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, మాజీ ఏడీజీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. ప్రపంచ గ్లకోమా వారోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో బంజారా హిల్స్ లో ఈరోజు నిర్వహించిన గ్లకోమా అవగాహన వాక్ ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ నడక ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ కల్లం అంజిరెడ్డి ప్రాంగణంలో ప్రారంభమయింది. జూబ్లీ హిల్స్ లోని కేబీఆర్ పార్క్ ముఖద్వారం వద్ద ముగిసింది. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేసే గ్లకోమా పై అవగాహన పెంచేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ తీసుకున్న ఈ చర్య అభినందనీయం అన్నారు. అత్యున్నత స్థాయి కంటి సంరక్షణ సేవలతో ఈ సంస్థ కేవలం వైద్య రంగంలోనే కాకుండా, హైదరాబాదును అంతర్జాతీయ వైద్య కేంద్రంగా మార్చడంలోనూ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.
గ్లకోమా ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారిలో కనిపించే సమస్య అన్నారు. అధిక శాతం దీనిని గుర్తించకుండానే అంధత్వానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ లో దాదాపు కోటి మందికి, ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల మందికి పైగా ఈ వ్యాధి ఉందన్నారు. అయితే, వారిలో చాలా మందికి దీని గురించి తెలియకపోవడం ఆందోళనకరం అన్నారు. ఈ తరహా అవగాహన కార్యక్రమాలు దీని నివారణకు ఎంతో అవసరమన్నారు. ఆర్టీసీ కూడా ఈ ప్రచారంలో చురుకుగా పాల్గొంటుందన్నారు. బస్టాండ్లు, బస్సులు, సిబ్బంది ద్వారా గ్లకోమా ప్రమాదం, కంటి పరీక్షల ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ మాట్లాడుతూ.. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ తీసుకున్న ఈ మహత్తర ప్రయత్నాన్ని అభినందించారు. దృష్టి సంరక్షణ కోసం అంకితభావంతో పని చేస్తున్న సంస్థగా ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ పేరుగాంచిందన్నారు. నా వృత్తి పూర్తిగా మంచి దృష్టి పై ఆధారపడి ఉంటుందన్నారు. అయితే, అంధత్వం ఎంత బాధాకరమో? తెలుసన్నారు. నా తల్లి చూపును కోల్పోయారన్నారు. ఈ లోకం ఎంతో అందం ఉందన్నారు. దానిని ఆస్వాదించడానికి మనకున్న శక్తి మన చూపేనన్నారు.
అందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కల్లం అంజిరెడ్డి క్యాంపస్లో గ్లకోమా నిపుణుడిగా సేవలందిస్తున్న కన్సల్టెంట్ ఆఫ్థల్మాలజిస్ట్ డాక్టర్ సిద్ధార్థ్ దీక్షిత్ మాట్లాడుతూ… గ్లకోమాను ప్రారంభ దశల్లో గుర్తించడం చాలా అవసరమన్నారు. అంధత్వాన్ని నివారించడం కోసం ప్రతి ఒక్కరూ సమగ్ర కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు.
ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ గ్లకోమా విభాగాధిపతి డాక్టర్ శిరిషా సెంథిల్ మాట్లాడుతూ… గ్లకోమా వల్ల కంటి చూపు క్రమంగా తగ్గిపోతుందన్నారు. చికిత్స అందించకపోతే పూర్తిగా అంధత్వానికి దారితీస్తుందన్నారు. 40 ఏళ్లు దాటిన ప్రతి 8 మందిలో ఒకరికి గ్లకోమా ఉన్నందున, కంటి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు.
పుట్టిన వెంటనే బిడ్డ కళ్ళల్లో నలుపు రంగు.. తెలుపు లేదా నీలం రంగులోకి మారడం గ్లకోమా సంకేతంగా భావించాలన్నారు. ఈ దశలో గ్లకోమాను గుర్తించి చికిత్స అందిస్తే, పిల్లలు సాధారణ చూపుతో పెరుగుతారన్నారు. అయితే, కొద్ది నెలల ఆలస్యం కూడా శాశ్వత అంధత్వానికి దారితీయవచ్చన్నారు. అవసరం లేని స్టెరాయిడ్ ఔషధాలను ఉపయోగించడం, ప్రత్యేకంగా కంటి చుక్కలను డాక్టర్ సలహా లేకుండా వాడటం గ్లకోమాకు కారణమవుతుందని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా గ్లకోమా ఉన్నవారి సంఖ్య దాదాపు 80 మిలియన్లు ఉన్నదని అంచనా. అందులో దాదాపు 50 శాతం మందికి అది ఉన్నదనే అవగాహన లేదు. పునరుద్ధరించలేని అంధత్వానికి అత్యంత సాధారణ కారణం గ్లకోమా. 40 ఏళ్ల వయస్సు పైబడిన ప్రతి 200 మందిలో ఒకరికి, 80 ఏళ్లు పైబడిన ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి గ్లకోమా ఉంది. అందుబాటులో ఉన్న గణాంకాలు 1.2 కోట్ల భారతీయులు (భారత జనాభాలో 4.5శాతం) గ్లకోమా బారిన పడుతున్నారని సూచిస్తున్నాయి. అందులో 11 లక్షలమంది గ్లకోమా కారణంగా అంధులయ్యారు. పెద్దలు, పిల్లలు ఇద్దరినీ ప్రభావితం చేసే గ్లకోమా వ్యాధి గురించి అవగాహన పెంచడానికి ఎల్విపిఇఐ నేత్ర సంరక్షణా వ్యవస్థ మార్చి 8-16 తేదీలలో గ్లకోమా అవగాహన వారోత్సవాన్ని నిర్వహించింది. వారం రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక మాధ్యమంలో ప్రచారాలు, ప్రాక్టీస్ చేస్తున్న వారి కోసం వర్క్షాప్లు , నిరంతర వైద్య విద్య (సిఎంఈ) సెషన్లు నిర్వహించారు. ఈ రోజు జరిగిన గ్లకోమా అవగాహన నడకతో దాదాపు 600 మంది పాల్గొన్నారు. కెబిఆర్ పార్కుకు వచ్చే సందర్శకులను కూడా అవగాహన నడకలోకి ఆకర్షించింది.
ప్రపంచ గ్లకోమా సంస్థ ప్రకారం, ఈ క్రింది పరీక్ష చేయించుకోవడం మంచిది:
మీరు 40 ఏళ్ల వయసు కంటే తక్కువ వయసు వారయితే ప్రతి 2-4 సంవత్సరాలకు ఒకసారి.. 40-60 ఏళ్ల వయసు మధ్య వారయితే ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి ..60 ఏళ్ల వయసు పైబడిన వారయితే ప్రతి 1-2 సంవత్సరాలకు ఒకసారి.. ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ: “అవసరంలో ఉన్నవారందరికీ అందుబాటులో ఉండగల అత్యుత్తమ, న్యాయబద్ధ నేత్ర సంరక్షణా వ్యవస్థలను రూపొందించడం” అనే లక్ష్యంతో 1987 సంవత్సరంలో స్థాపించబడిన ఒక సమగ్ర నేత్ర ఆరోగ్య సౌకర్యం, ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ (ఎల్విపిఇఐ), అంధత్వ నివారణకై ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకార కేంద్రం.
ఈ లక్ష్య సాధనలో, ఎల్విపిఇఐ వైద్యులు , శాస్త్రవేత్తలు అత్యాధునిక కంటి పరిశోధన దిశలో పని చేస్తున్నారు. ఐదు శ్రేణుల “ఐ హెల్త్ పిరమిడ్” నమూనా ద్వారా సంస్థ ఇప్పటివరకూ 3 కోట్ల 68 లక్షల సేవలను అందించింది. అందులో సంరక్షణ సంక్లిష్టతతో సంబంధం లేకుండా, 50 శాతం కంటే ఎక్కువ ఉచితం. మరింత సమాచారానికి సంస్థ వెబ్ సైట్ www.lvpei.org సందర్శించండి. ఈ కార్యక్రమంలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వైస్ చైర్ ఎమెరిటస్ డాక్టర్ చంద్రశేఖర్ ,ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ గ్లకోమా విభాగాధిపతి డాక్టర్ శిరిషా సెంథిల్ తదితరులు పాల్గొన్నారు.
Read More..