టీజీపీఎస్సీ గ్రూప్ 3 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
టీజీపీఎస్సీ గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా, పగడ్బందీగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి. ముకుంద రెడ్డి, డిఆర్ఓ ఈ వెంకటాచారి అధికారులను ఆదేశించారు.
దిశ, హైదరాబాద్ బ్యూరో : టీజీపీఎస్సీ గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా, పగడ్బందీగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి. ముకుంద రెడ్డి, డిఆర్ఓ ఈ వెంకటాచారి అధికారులను ఆదేశించారు. మంగళవారం టీజీ పీఎస్సీ గ్రూప్ 3 పరీక్షల నిర్వహణపై రీజినల్ కోఆర్డినేటర్స్, స్ట్రాంగ్ రూమ్, జాయింట్ కస్టోడియన్స్, పోలీస్ నోడల్ ఆఫీసర్స్, చీఫ్ సూపరింటెండెంట్స్, డిఓ, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, జాయింట్ రూట్ ఆఫీసర్స్ తో నిర్వహించిన ట్రైనింగ్ కమ్ కోఆర్డినేషన్ మీటింగ్ లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఈ నెల 17వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ 1(జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్) పరీక్ష నిర్వహించడం జరుగుతుందని, పరీక్షా కేంద్రం గేట్లు ఉదయం 9.30 గంటలకు మూసివేస్తారని, అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని కోరారు.
అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 హిస్టరీ, పాలిటి అండ్ సొసైటీ పరీక్ష ఉంటుందని అభ్యర్థులు 2.30 గంటలకు ముందే సెంటర్లలో ఉండాలని సూచించారు . 18వ తేదీన సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు పేపర్ 3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పరీక్ష ఉంటుందని చెప్పారు . నిర్దేశించిన సమయం తర్వాత అభ్యర్థులు ఎవరిని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబడరు అని తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో 45,918 మంది అభ్యర్థులు టీజీపీఎస్సీ గ్రూప్ 3 పరీక్ష రాస్తున్నారని, వీరి కోసం 102 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని,ఇందులో పిడబ్ల్యుడి అభ్యర్థుల కోసం 27 కేంద్రాలను కేటాయించడం జరిగిందని చెప్పారు.
అభ్యర్థులు నలుపు/నీలం బాల్ పాయింట్ పెన్నులు , పెన్సిల్ అండ్ ఎరేజర్, హాల్ టికెట్‌ను దానిపై అతికించిన ఫోటో, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డ్‌ని మాత్రమే పరీక్ష హాల్‌లోకి తీసుకెళ్లాలన్నారు. అన్ని సమాధానాలు బాల్ పాయింట్ పెన్ (నీలం/నలుపు)తో మాత్రమే రాయాలని, మొబైల్ ఫోన్లు, చేతి గడియారాలు, క్యాలిక్యులేటర్ తో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను సెంటర్లలోకి అనుమతించబోమన్నారు . అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అభ్యర్థులు టీజీపీఎస్సీ సూచనలు పాటించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలన్నారు. పరీక్ష జరిగేటప్పుడు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని, పరీక్ష ఎంట్రెన్స్ గేట్, పరీక్ష కేంద్రాలు టేబుల్, చేర్స్ సానిటైజ్ చేయాలని, పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలన్నారు, పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఏఎన్ఎం, మందులను అందుబాటులో ఉంచాలన్నారు.