శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలే నా బలగం : ప్రభుత్వ విప్ గాంధీ
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నామని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ అన్నారు.
దిశ, శేరిలింగంపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నామని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ అన్నారు. గురువారం హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హెచ్ ఎంటీ హిల్స్ కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన హైదర్ నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యే గాంధీ ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ చేసిన ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో రెండు సార్లు అధికారం చేపట్టి తెలంగాణ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి నేడు దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు.
పరిపాలనా విషయంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా మారిందని అన్నారు. ఇప్పుడు యావత్ దేశం మొత్తం తెలంగాణ వైపు చూసే విధంగా రాష్ట్రం ప్రగతి వైపు పరుగులు పెడుతుందని, కోట్ల రూపాయల నిధులు వెచ్చించి శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని అన్నారు. తప్పుడు కథనాలు సృష్టించే ప్రతిపక్ష పార్టీల నాయకుల దుశ్చర్యలను తిప్పికొట్టే బాధ్యత మనందరి పైన ఉందని సూచించారు. ఎనిమిదేళ్లలో ఏమి చేశాము, రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నామనేది ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష అని, శేరిలింగంపల్లి ప్రజలే తన బలగం అని, వారే తన బలమని అన్నారు. బీఆర్ ఎస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రతి కార్యకర్తని కంటికి రెప్పలా చూసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్, ఏరియా కమిటీ సభ్యులు, బస్తి అధ్యక్షులు, మహిళ నాయకులు, పార్టీ అనుబంధ కమిటీలు, బస్తీ కమిటీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.