రాష్ట్రంలో కల్తీ ఆహారం కలకలం.. సీఎంకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కీలక రిక్వెస్ట్
రాష్ట్రంలో కల్తీ ఆహారం కలకలంపై సీఎం రేవంత్ రెడ్డికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కీలక రిక్వెస్ట్ చేసింది...

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఆహార కల్తీ సమస్య ఎక్కువగా ఉందని, ముఖ్యంగా హైదరాబాద్‌లో స్టార్ హోటళ్ళ నుంచి రోడ్డు పక్కన ఉన్న చిన్న చిన్న హోటళ్ళ వరకు ఆహార కల్తీ జరుగుతుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆహారకల్తీ సమస్యను దృష్టిలో ఉంచుకొని కల్తీ నివారణకై పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. అందులో భాగంగా కావలసినంత మంది ఆహార భద్రతా అధికారులను నియమించాలని, అలాగే వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాదులో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ లను ఏర్పాటు చేయాలని ఇంకా మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబులను పనిచేయించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సీఎం ను కోరుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ లో పెద్ద సంఖ్యలో హోటళ్ళు ఉండడంతో వాటికి తనఖీలకు అవసరమైన ఫుడ్ సేప్టీ అధికారులు లేనందున కల్తీ వ్యవహారం ఇష్టారాజ్యంగా జరుగుతున్నదన్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఫుడ్ టెస్టింగ్ లేబొరేటరీ ఒకటే ఉందని, దీనికి తోడు అందులో పరీక్ష నిమిత్తం సరియైన పరికరాలు లేవని అసహనం వ్యక్తం చేశారు.
అంతేకాక ఈ లేబొరేటరీలో సైంటిస్టులు, ఇతరులు కలిపి 78 పోస్టులు మంజూరు కాగా, ప్రస్థుతము 11 మంది మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు. మిగిలిన 67 పోస్టులు ఖాళీగా ఉన్నందున ఈ ల్యాబు నామ్ కే వాస్తే అన్నట్లుగా ఉందన్నారు. కేంద్రప్రభుత్వము రెండు సంవత్సరాల క్రితమే ల్యాబులు వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాదులో ల్యాబులకు నిధులు కూడా మంజూరు చేసిందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను వినియోగించుకోలేకపోవడంతో ఆ నిధులు ల్యాప్స్ అయ్యే ప్రమాదముందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక సంచార ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ (మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్) ఉందని, ఇందులో సరిపడ పరికరాలు లేక పరీక్షలు అంతంత మాత్రమే జరుగుతున్నాయన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం 5 సంచార ల్యాబ్ లను మంజూరు చేస్తూ నిధులు విడుదల చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం 5 వ్యానులను మాత్రమే కొని, అందులో పరీక్షల కొరకు కావలసిన పరికరాలు కొనలేదన్నారు. కేంద్ర నిధులు ల్యాప్స్ అయ్యే పరిస్థితి ఉంది. గతంలో ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆహార కల్తీ గురించి ప్రజలు ఫిర్యాదు చేయడానికి ఒక విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించినా అది కార్యరూపం దాల్చక కాగితాలకే పరిమితమైందన్నారు.