పోలీసు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

తెలంగాణలో పోలీస్ కానిస్టేబుళ్లు , సబ్ ఇన్‌స్పెక్టర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Update: 2024-09-18 16:04 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో : తెలంగాణలో పోలీస్ కానిస్టేబుళ్లు , సబ్ ఇన్‌స్పెక్టర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం తెలంగాణ సచివాలయంలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తాను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసు కానిస్టేబుళ్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లకు ట్రైనింగ్ నుండే బేసిక్ పే అమలు చేయాలని, తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా మంది పోలీసు కానిస్టేబుళ్లను బలవంతంగా సెలవుపై పంపడం లేదా సస్పెండ్ చేయడంతో 2 నుండి 3 నెలల సర్వీసును కోల్పోయారని ,వారికీ న్యాయం చేయాలన్నారు. జీవో 317 అమలు సీనియారిటీ సమస్యలకు దారితీసిందని, ఈ జీవో వల్ల చాలా మంది జూనియర్లు సీనియర్ల కంటే పదోన్నతి పొందారని, ఉద్యోగులకు గుదిబండగా మారిన ఈ జీవోను రద్దుచేయాలన్నారు ప్రమోషన్ విధానంలో ఒక రిక్రూట్ మెంట్ జరిపితే ఆ బ్యాచ్ కు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ప్రమోషన్ విధానం అమలులో ఉండాలన్నారు.

    ఈ విధానం ఇప్పటికే ఎస్సై ప్రమోషన్ విధానంలో అమలులో ఉందని, కింది స్థాయిలో పనిచేసే కానిస్టేబుళ్ల కు కూడా అమలు చేయాలన్నారు. ఒకే బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుళ్లు ఇతర జిల్లాల్లో హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు కానీ వారి సొంత జిల్లాలో మాత్రం కానిస్టేబుళ్లు గానే పనిచేస్తున్నారని, వారి పదోన్నతులలో జాప్యం జరగకుండా చూడాలన్నారు. సాధారణ సెలవుల సంఖ్యను 15 నుండి 30 కి పెంచాలని, విధి నిర్వహణలో గాయపడిన పోలీసు ఉద్యోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఆరోగ్య భద్రత కింద అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో పోలీసు ఉద్యోగులకు ఉచితంగా మెరుగైన చికిత్స అందించాలన్నారు. ముఖ్యమంత్రి కూడా పోలీసు కుటుంబం నుంచే వచ్చారని, వారి సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, అన్ని శాఖల ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ ముందుకెళ్తున్న ప్రభుత్వం పోలీసు ఉద్యోగుల సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉజ్జెళ్లి శేఖర్, స్వామి గౌడ్, బాలరాజు, వినోద్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News