వారికి ఒంటరి మహిళలే టార్గెట్
ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్న దంపతులను లాలాగూడ పోలీసులు ఆరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
దిశ, సికింద్రాబాద్ : ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్న దంపతులను లాలాగూడ పోలీసులు ఆరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు శనివారం లాలాగూడ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి హాజరై వివరాలు వెల్లడించారు. నల్గొండ జిల్లాలోని త్రిపురారం మండలం చెన్నైపాలెంకు చెందిన నేనావత్ హరి నాయక్ కొంత కాలం క్రితం నగరానికి వలసొచ్చాడు. వడ్డేపల్లి లక్ష్మి(40) అలియాస్ కవిత అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సహజీవనం సాగిస్తున్నారు. హస్తినాపురంలోని రాఘవేంద్ర హోటల్ సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. అయితే ఈజీ మనీకి అలవాటు పడిన ఈ దంపతులు ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ దోపిడీలు చేస్తుండేవారు. ఈ క్రమంలో ఆగస్టు 3న సాయంత్రం 6 గంటల సమయంలో అత్తాపూర్ లోని ఓ కల్లుకంపోండ్కు వెళ్లిన ఈ దంపతులు అక్కడ ఒంటరిగా ఉన్న అచ్చమ్మ అనే మహిళతో మాట కలిపారు. పని ఇప్పిస్తామని చెప్పి అచ్చమ్మను
ఆటో ఎక్కించుకొని నార్త్ లాలాగూడలోని రైల్వే మద్దూర్ యూనియన్ కార్యాలయం సమీపంలోని మహంకాళి ఆలయం వద్దనున్న ఖాళీ ప్రదేశానికి తీసుకొచ్చారు. అనంతరం అచ్చమ్మను చంపేస్తామని బెదిరించి ఆమె వద్దనున్న నల్లపూసలు, బంగారు గొలుసు, చెవి కమ్మలు, ముక్కుపుడక, మెట్టెలు ( మొత్తం రూ.30 వేల విలువగల 12 గ్రాముల బంగారు నగలు, 3 తులాల వెండి ఆభరణాలు) లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. కాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అత్తాపూర్ నుంచి లాలాగూడ పోలీస్ స్టేషన్ వరకు ఉన్న సీసీ కెమెరాలను పూర్తిగా పరిశీలించారు. సీసీ పుటేజీల ఆధారంగా దొంగిలించిన సొత్తును సికింద్రాబాద్ పాట్ మార్కెట్లోని శ్రీ స్వతంత్ర జ్యువెల్లర్స్, శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెల్లర్స్ యజమానులు సంజయ్ ఉపాద్యాయ్, ప్రవీణ్కుమార్లకు విక్రయించినట్లు గుర్తించారు.
వారి వద్దకు వెళ్లి విచారించి శనివారం ఉదయం క్రైమ్ ఎస్ఐ నాగరాజు నేతృత్వంలో పలువురు కానిస్టేబుళ్లు నిందితులు హరి నాయక్, వడ్డె లక్ష్మిలను హస్తినపురంలోని నందనవనం కాలనీలో అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 7 గ్రాముల బంగారు నగలు, 23 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. అదే విధంగా దొంగలించిన సొత్తును కొనుగోలు చేసిన జ్యువెల్లరీ షాపు యజమానులపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడు హరి నాయక్పై ఇది వరకు 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు 7 పోలీస్ స్టేషన్లలో 10కి పైగా కేసులు నమోదై ఉన్నాయని వివరించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీపీపీ నర్సయ్య, ఏసీపీ జైపాల్ రెడ్డి, ఇన్స్పెక్టర్ కరుణాకర్‌రెడ్డి, ఎస్ఐ లు నాగరాజు, షాహీద్ పాషా, క్రైమ్ టీమ్ రాజశేఖర్, సుమంత్, సాయినాథ్, జగదీష్, నవీన్, వేణు పాల్గొన్నాడు.