అది నిజమైతే సంతకం చేయ్.. సీఎం కేసీఆర్‌కు షర్మిల సవాల్

పదవులైనా, బతుకైనా అన్నీ తెలంగాణ కోసమేనని ముఖ్యమంత్రి కేసీఆర్ మహా బిల్డప్ ఇస్తారని, అదే నిజమైతే బంగారు తెలంగాణలో బుడగల్లా పేలిపోతున్న యువత భవిత కోసం తాను పంపించిన అఫిడవిట్ పై సీఎం కేసీఆర్ బంగారు సంతకం పెట్టాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల బుధవారం ఒక ప్రకటనలో ఎద్దేవాచేశారు...

Update: 2023-05-17 15:30 GMT
  • నిజమైతే అఫిడవిట్‌పై సంతకం చెయ్
  • పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తామని భరోసా ఇవ్వు
  • - వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల

దిశ, తెలంగాణ బ్యూరో: పదవులైనా, బతుకైనా అన్నీ తెలంగాణ కోసమేనని ముఖ్యమంత్రి కేసీఆర్ మహా బిల్డప్ ఇస్తారని, అదే నిజమైతే బంగారు తెలంగాణలో బుడగల్లా పేలిపోతున్న యువత భవిత కోసం తాను పంపించిన అఫిడవిట్ పై సీఎం కేసీఆర్ బంగారు సంతకం పెట్టాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల బుధవారం ఒక ప్రకటనలో ఎద్దేవాచేశారు. టీఎస్ పీఎస్సీ పరీక్షలు ఈసారి కచ్చితంగా పటిష్టంగా, సమర్థవంతంగా, ఎలాంటి లీకులు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని భరోసా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. పిల్లల కోసం సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నది నిజమైతే వారి బతుకులతో తెలంగాణ సర్కార్ ఎలాంటి ఆటలు ఆడదనే ధైర్యం కలిగించాలనుకుంటే సీఎం కేసీఆర్ వెంటనే సంతకం పెట్టాలన్నారు.

80 వేల పుస్తకాలు చదివి, ఏకంగా రాజ్యాంగాన్నే తిరగరాద్దామనుకున్న ముఖ్యమంత్రికి ఒక సీఎం సంతకంపెట్టిన అఫిడవిట్ పవర్ ఏమిటో చెప్పక్కర్లేదని ఆమె చురకలంటించారు. తెలంగాణాలో ఎప్పటికీ పేపర్ లీకులుండవని కేసీఆర్ తన మాటగా ఒక సంతకంతో చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములెన్ని, అసైన్డ్ భూములెన్నో అనే అంశంపైనా కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని షర్మిల డిమాండ్ చేసింది. పేనుకు పెత్తనమిస్తే నెత్తంతా గొరిగినట్లు.., కేసీఆర్‌కు అధికారమిస్తే తెలంగాణ మొత్తాన్ని అమ్మకానికి పెడుతున్నాడని ధ్వజమెత్తారు. నాటి దొరలు బలవంతంగా భూములు దోచుకుంటే నేటి దొర జీవోలతో భూములు అమ్మేసి, వేల కోట్లు వెనకేస్తున్నాడని మండిపడ్డారు. రైతులకిచ్చిన అసైన్డ్ భూములను, పరిశ్రమలకిచ్చిన భూములను సైతం వదలడం లేదని విమర్శలు చేశారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మడమంటే భావితరాన్ని హత్య చేయడమేనని ఆమె పేర్కొన్నారు.

Tags:    

Similar News