రసవత్తరంగా మారిన శేరిలింగంపల్లి రాజకీయాలు
శేరిలింగంపల్లి రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. మూడు ప్రధాన పార్టీలు ఇక్కడి నుంచి బరిలో ఉండనున్నాయి. బీఆర్‌ఎస్ నుంచి మరోసారి గాంధీ పోటీలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి జగదీశ్వర్‌గౌడ్ టికెట్ దక్కించుకున్నారు.
దిశ, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. మూడు ప్రధాన పార్టీలు ఇక్కడి నుంచి బరిలో ఉండనున్నాయి. బీఆర్‌ఎస్ నుంచి మరోసారి గాంధీ పోటీలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి జగదీశ్వర్‌గౌడ్ టికెట్ దక్కించుకున్నారు. ఇక బీజేపీ నుంచి ఇప్పటికి ఎవరికి టికెట్ దక్కలేదు. శేరిలింగంపల్లి నుంచి బీజేపీ బరిలో ఉంటుందా, లేక పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ కేటాయిస్తుందా అన్నది ఇంకా స్పష్టత లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం శేరిలింగంపల్లి నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు మాత్రం రోజురోజుకు మారిపోతున్నాయి. ప్రధానంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోకి చేరికలు జోరందుకున్నాయి. ఈ రెండు పార్టీలు పోటాపోటీగా ప్రచారం కూడా మొదలుపెట్టాయి.
జోరుగా చేరికలు..
బీఆర్‌ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ నేతృత్వంలో ఆయా పార్టీలకు చెందిన పలువురు నాయకులు గులాబీ కండువా కప్పుకుంటున్నారు. అటు ఎమ్మెల్యే గాంధీ సైతం క్షేత్రస్థాయిలో కాలనీల వారీగా పర్యటిస్తూ స్థానికులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ బీఆర్‌ఎస్ పార్టీని మరోసారి ఆదరించాలని కోరుతున్నారు. ఇన్నాళ్లుగా తాము చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళుతున్నారు. అటు కాంగ్రెస్ పార్టీలోనూ ఈ చేరికల పర్వం జోరుగా సాగుతోంది. ఆయా డివిజన్‌లకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే పలు సంఘాల నాయకులు కూడా కాంగ్రెస్ అభ్యర్థికి తమ మద్దతు ప్రకటిస్తున్నారు. అటు కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్‌గౌడ్ ఆయా డివిజన్‌లలోని ముఖ్య నాయకులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ తనకు మద్దతు తెలపాలని కోరుతున్నారు.
పార్టీలు మారేందుకు నేతల చూపు..
ఓ వైపు ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆయా పార్టీల నాయకులు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పుడున్న పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డ వారు, సముచిత స్థానం దక్కని వారు, అక్కడున్నా రాజకీయ ప్రయోజనం లేదనుకున్న వారు పక్క పార్టీల్లోకి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు. తమ వర్గీయులతో, సహచరులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ ఏదో ఒక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఓ మాజీ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. అలాగే టికెట్ ఆశించి భంగపడ్డ ఇద్దరు నాయకులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. వారితో ఇప్పటికే మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు చర్చలు జరుపుతున్నట్లు వారి అనుచరులు చెబుతున్నారు.
అటు ఇటు..
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పార్టీలు మారడం ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్‌గౌడ్ ఆధ్వర్యంలో హస్తం కండువా కప్పుకున్నారు. ఇంకొతమంది బీఆర్‌ఎస్‌లోనే ఉంటాం కానీ ఇక్కడ పనిచేస్తాం అని హామీ ఇస్తున్నట్లు అంతర్గత సమాచారం. అటు బీఆర్‌ఎస్‌లోనూ ఇదే తరహాలో కొందరు నాయకులు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇన్నాళ్లు ఏదో రకంగా ఎమ్మెల్యేతో లబ్ధిపొందాం, ఇప్పుడు ఎన్నికల్లో హ్యాండ్ ఇస్తే బాగోదు ఆయనతోనే కలిసి ఉంటాం అనే వారు కూడా లేకపోలేదు. ఇక బీజేపీ అభ్యర్థి ఎవరో ప్రకటించకపోవడం, శేరిలింగంపల్లి టికెట్ జనసేనకు కేటాయిస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఆపార్టీకి చెందిన కొంతమంది లీడర్లు బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతుంది.
అలాగే కాంగ్రెస్ టికెట్ ఆశించి తీవ్రంగా కష్టపడి ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపిన రఘునాథ్‌యాదవ్ త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జరిపేటి జైపాల్ కూడా టికెట్ ఆశించి నిరాశకు గురయ్యారు. శనివారం ఆయన ఇంటికి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లురవి జెరిపేటి జైపాల్‌ను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని, పార్టీ అధికారంలోకి వస్తే తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అయినా జెరిపేటి ముభావంగానే ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇలా అన్ని పార్టీల్లోనూ భిన్నమైన రాజకీయ వాతావరణం కనిపిస్తుంది.