దళితుల భూమిలో `రియల్` గద్దలు.. ఆక్రమణదారులకే రెవెన్యూ అధికారుల వత్తాసు
రియల్ గద్దలు సర్కారు భూములనే కాదు దళితుల పట్టా భూములనూ వదలడం లేదు. పూర్వీకుల నుండి వచ్చిన పట్టా భూమిని రియల్ మాఫీయా స్వాహా చేసింది. ప్రభుత్వ భూమితో పాటు పక్కనే ఉన్న పట్టా భూమిలో మారు సర్వేనంబర్లు వేసి వేంచర్లు చేసి అమ్మేసింది. హయత్‌నగర్ మండలం అన్మగల్ హయత్‌నగర్ సర్వేనంబర్ 38 లో ఉన్న 34 గుంటల (4,114 గజాల) పట్టా భూమిని రియల్ గద్దలు మింగేశాయి. ఈ విషయంపై ఆ పేద దళితుడు చెప్పులు అరిగేలా మండల తహసీల్ధార్ కార్యాలయం చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదు. తన భూమి ఆక్రమణకు గురైనప్పటి నుండి తన పట్టా భూమి తనకు ఇప్పించి న్యాయం చేయాలంటూ తొక్కని గడపలేదు. చివరికి ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించాడు. కలెక్టర్ జోక్యంతోనైనా ఈ సమస్య పరిష్కారమై దళితుడికి న్యాయం జరుగుతుందా..? లేదా...? వేచిచూడాలి మరి..!
దిశ, ఎల్బీనగర్: హయత్‌నగర్ మండలంలో భూ మాఫియా రాజ్యమేలుతుంది. ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా అక్కడ రియల్ గద్దలు వాలిపోతున్నాయి. వాటిని ఆక్రమించి తప్పుడు సర్వేనంబర్లతో రిజిస్ట్రేషన్లు చేసి విక్రయిస్తున్నాయి. చివరికి ఓ దళితుడి పట్టా భూమిని కూడా వదల్లేదు. తప్పుడు సర్వేనంబర్లతో ఆక్రమించేశారు. హయత్‌నగర్ మండలం అన్మగల్ హయత్‌నగర్ సర్వేనంబర్ 38 లో రాజం సత్యనారాయణ భూమిని పక్కనున్న పట్టాదార్లు (రియల్ వ్యాపారులు) ఆక్రమించారు. అప్పటి నుండి బాధితుడు వారిపై పోరాటం చేస్తునే ఉన్నాడు. పేద దళితుడు కావడంతో రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులకే వత్తాసు పలికారు. చివరికి ఈ 34 గుంటల పట్టా భూమిని తమ భూమిలో కలుపుకొని 35, 37, 39 సర్వేనంబర్‌లతో ప్లాట్లు చేసి విక్రయించారు. దీంతో బాధితుడు తట్టుకోలేక ఆ భూమిలో ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు ప్రయత్నించాడు. దీనిని సాకుగా తీసుకుని ఆక్రమణదారులు అప్పుడున్న పోలీసులను తమకు అనుకూలంగా చేసుకుని బాధితుడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు బాధితుడిపై 2014 ఆగస్టులో క్రిమినల్ కేసు నమోదు చేశారు.
దీంతో బాధితుడు రాజం సత్యనారాయణ తనకు న్యాయం చేయాలంటూ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించాడు. భూసర్వే నిర్వహించి ఇరు పార్టీల సర్వే నంబర్‌ను హద్దులను గుర్తించి బాధితుడికి న్యాయం చేయాలంటూ ఎస్సీ కమిషన్ జిల్లా కలెక్టర్‌కు, ఆర్డీవోకు, మండల తహసీల్ధార్‌కు, పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు రంగారెడ్డి జిల్లా సర్వే అండ్ లాండ్ రికార్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)కి సర్వే చేయాలంటూ లేఖ రాసింది. బాధితుడు 2018లో రెండవ సారి తన భూమిని రంగారెడ్డి అండ్ లాండ్ రికార్డ్స్ ఏడీ ద్వారా సర్వే నిర్వహించుకున్నాడు. తన భూమి హద్దులు చూపి హద్దురాళ్లు పాతుకోవచ్చని ఆర్డర్ కాపీ ఇచ్చారు. అయినా రెవెన్యూ అధికారులు సహకరించకపోవడంతో బాధితుడికి న్యాయం దక్కలేదు.
2012లోనే సర్వే
బాధితుడు రాజం సత్యనారాయణ తనకు న్యాయం చేయాలంటూ, తన పట్టా భూమి సర్వే చేసి హద్దురాళ్లు చూపాలంటూ రంగారెడ్డి జిల్లా సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ అధికారులకు ఆర్జీ పెట్టుకున్నాడు. దీంతో అధికారులు 2012లో సర్వే నిర్వహించి పక్క పట్టాదారుల సమక్షంలో పంచనామా నిర్వహించి తన పట్టా భూమిలో హద్దురాళ్లు ఏర్పాటు చేసుకోవచ్చని అందరి సంతాకాలతో కూడిన పత్రాలను అందజేశారు. అయినా రెవెన్యూ అధికారులు బాధితుడికి సహకరించకపోవడంతో ఆక్రమణదారులు యధేచ్చగా 34 గుంటల భూమి ఆక్రమించి 35, 37, 39 సర్వేనంబర్‌లతో ప్లాట్లు చేసి విక్రమించుకున్నారు. తిరిగి బాధితుడు 2018లో కూడా సర్వే చేయించాడు. అప్పుడు కూడా సర్వే అధికారులు సర్వేచేసి హద్దులు చూపించారు. అయినా ఆ భూమిని తనకు కేటాయించడంలో రెవెన్యూ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
జిల్లా కలెక్టర్‌కు తప్పుడు నివేదిక..!
తనకు న్యాయం చేయాలంటూ బాధితుడు రాజం సత్యానారాయణ మరోసారి ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించాడు. దీంతో ఎస్సీ కమిషన్ సమగ్ర వివరణ ఇవ్వాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. దీంతో జిల్లా కలెక్టర్ తనకు అన్మగల్ హయత్‌నగర్ 38 సర్వే నంబర్ యొక్క సమగ్ర నివేదక వెంటనే కావాలంటూ ఇటీవల హయత్‌నగర్ మండల తహసీల్ధార్‌ను ఆదేశించారు. దీంతో హయత్‌నగర్ మండల తహసీల్ధార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను తప్పుతోవ పట్టిస్తూ తప్పుడు నివేదిక ఇచ్చిందంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో స్టే లేకున్నా ఉన్నట్లు, జిల్లా రిజిస్ట్రార్‌కు రాసిన ఓ ఆర్డర్ కాఫీని ఆధారం చేసుకుని ఎందుకు జిల్లా కలెక్టర్‌ను కూడా తప్పుదోవ పట్టిస్తుందంటూ బాధితుడు ప్రశ్నిస్తున్నాడు. ధరణి పోర్టల్‌లో, ఇతర రెవెన్యూ రికార్డుల్లో ఎక్కడైనా తానే పట్టాదారుగా ఉన్నామని రాజం సత్యనారాయణ పేర్కొంటున్నాడు.
నాకు న్యాయం చేయండి
నా 34 గుంటల పట్టా భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించుకున్నరు. ఏళ్ళ తరబడి న్యాయం కోసం పోరాడుతున్న. నా భూమిని అధికారులు సర్వే కూడా చేశారు. నా భూమిని ఆక్రమించుకున్న వాళ్ళు ఎందుకు సర్వే చేసుకోవడం లేదు. ఇప్పటికైనా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఇబ్రాహీంపట్నం ఆర్డీఓ తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితుడు.