R. Krishnaiah : ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కులగణన చేపట్టాలి..
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కులగణన చేపట్టాలని, కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
దిశ, హిమాయత్ నగర్ : ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కులగణన చేపట్టాలని, కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం 14 బీసీ సంఘాలు, 22 బీసీ కుల సంఘాలు, ఉద్యోగ సంఘాల సమావేశం బీసీ ఫ్రంట్ చైర్మన్ గొరిగే మల్లేష్ అధ్యక్షతన బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 20 శాతం నుండి 42 శాతానికి పెంచాలని, కులగణన చేపట్టడానికి న్యాయపరమైన అడ్డంకులు ఏమి లేవని, ప్రభుత్వం తలుచుకుంటే వారంలోపు కులగణన లెక్కించవచ్చని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుండి నేటి వరకు ఒక్కసారి కూడా బీసీ ముఖ్యమంత్రి అవకాశం రాలేదని, కనీసం సర్పంచులు అవడానికి కూడా బీసీలకు అవకాశం ఇవ్వరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సుప్రీంకోర్టు అనేక కేసులలో జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని అనేక తీర్పులు చెప్పిందని, ఉత్తరప్రదేశ్ కేసులో కులగణన చేసి రిజర్వేషన్లు పెంచితే అభ్యంతరం లేదని చెప్పిందని వివరించారు.
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కులాల వారి లెక్కలు తీస్తామని జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని పలు బహిరంగ సభలలో ప్రసంగిస్తున్నారని ఆయన అన్నారు. ఇండియా కూటమి బలంగా ఉందని, బీసీ బిల్లు పై పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడితే, అన్ని పార్టీలను ఒప్పించేలా రాహుల్ గాంధీ చొరవ తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్రం సత్యనారాయణ, రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం నాయకులు అంజి, రాష్ట్ర బీసీ సంఘం ఉద్యోగుల సంఘం నాయకులు కృష్ణుడు, రాష్ట్ర బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్, బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్ రాందేవ్, రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్ పృథ్వి గౌడ్, యువజన సంఘం నాయకులు భాస్కర్, దీపిక బిల్లా, జయంతి, మణికంఠ, కృష్టుడు తదితరులు పాల్గొన్నారు.