ఆపరేషన్ ‘మూసీ’..! పరిసర ప్రాంతాల్లో అధికారుల సర్వే షురూ

జీహెచ్ఎంసీ పరిధిలో మూసీ సుందరీకరణలో భాగంగా నిర్వాసితుల గుర్తింపు సర్వే ఆందోళనలకు దారి తీస్తోంది.

Update: 2024-09-27 02:45 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో మూసీ సుందరీకరణలో భాగంగా నిర్వాసితుల గుర్తింపు సర్వే ఆందోళనలకు దారి తీస్తోంది. పలు చోట్ల సర్వే కోసం వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. వారితో వాగ్వాదానికి దిగారు. పేదల కడుపుకొట్టొద్దని వేడుకున్నారు. అయినా పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు ముందుకు సాగడంతో ఆందోళనలకు దారి తీసింది. ఈ సందర్భంగా బాధితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా ఆక్రమణలను గుర్తించేందుకు అధికారులు గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించారు.

అధికారులు బృందాలుగా ఏర్పడి గోల్కొండ ఇబ్రహింబాగ్, లంగర్ హౌస్ డిఫెన్స్ కాలనీ, పాతబస్తీ, చాదర్‌ఘాట్, శంకర్ నగర్, అంబర్‌పేట్, ముసారాంబాగ్, కొత్తపేట, మారుతీనగర్, సత్యానగర్, ఫణిగిరికాలనీ, ఇందిరానగర్, గణేష్‌పురి తదితర ప్రాంతాలలో సర్వే చేసేందుకు వచ్చారు. అధికారుల రాక గురించి ముందుగానే సమాచారం అందడంతో బస్తీలలో మూసీ నిర్వాసితులు వందల సంఖ్యలో గుమికూడి సర్వేకు సహకరించకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. నిర్మాణాలకు అనుమతినిచ్చి ఇప్పుడు కూల్చివేస్తామంటే ఊరుకోబోమని వారు హెచ్చరించారు. సుమారు మూడు దశాబ్ధాలకు పైగా అమ్మకాలు, నిర్మాణాలు జరుగుతుంటే చేతులు ముడుచుకుని ఎందుకు కూర్చున్నారంటూ ప్రశ్నించారు. ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులు కడుతున్నామని వాపోయారు. కాగా హైదరాబాద్ జిల్లాలో మొత్తం 16 అధికారుల బృందాలు సర్వే చేపడుతూ 1,595 నిర్మాణాలను గుర్తించారు.

నిరసనలు లెక్క చేయకుండా మార్కింగ్..

మూసీ బెడ్‌ను అనుసరించి నిర్వాసితులను గుర్తించేందుకు వచ్చిన అధికారుల బృందానికి స్థానికుల నుంచి నిరసనలు ఎదురౌతున్నా పోలీసుల సహకారంతో కొన్ని చోట్ల మార్కింగ్ చేశారు. తహసీల్దార్ నేతృత్వంలో పర్యటిస్తున్న అధికారులు మూసీని అనుసరించి ఉన్న వారి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. పేదలు ఎవరికీ ప్రభుత్వం నష్టం చేయదని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. మీరు ఒప్పుకుంటే మీకు ఇప్పుడే ఎక్కడ డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించామో చెబుతామని, అవసరం అయితే ఖాళీ చేసి అక్కడికి వెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పిస్తామని అధికారుల బృందం సర్ధి చెప్పారు. అయినా వారు వినకుండా మొండికేశారు. కొంతమంది ముందుకు వచ్చి వివరాలు చెప్పడంతో నమోదు చేసుకున్నారు. తొలగింపు ఎక్కడి నుంచి ఎక్కడి వరకనేది తెలిసేలా మార్కింగ్ చేశారు.

బఫర్‌జోన్ జోలికి వెళ్లని అధికారులు..

మూసీ బ్యూటిఫికేషన్‌లో భాగంగా నిర్వాసితులను రెండు రకాలుగా గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీరిలో మూసీని అనుసరించి నివాసముంటున్న వారు, బఫర్ జోన్ నివాసితులుగా గుర్తించారు. ముందుగా మూసీ బెడ్ వెంట ఉన్నవారిని అక్కడి నుంచి తరలించి డబుల్ బెడ్ రూంలు కేటాయిస్తుంది. మూసీ పరివాహక ప్రాంతం నుంచి 50 మీటర్ల పరిధిని బఫర్ జోన్‌గా ప్రభుత్వం ప్రకటించింది. దీని పరిధిలో పెద్ద అపార్ట్‌మెంట్‌లు, బహుళ అంతస్తుల భవనాలు ఉండడంతో అధికారులు వాటిల్లో ఉంటున్న వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వకపోవడం గమనార్హం. అయితే చాలా చోట్ల కూల్చివేతలను సూచించే మార్కింగ్ చేశారు. దీంతో బఫర్ జోన్‌లో నివాసముంటున్న వారు కూడా కార్యాచరణ రూపొందించి అడ్డుకునేందుకు చూస్తున్నారు.

పోలీసులు లేకుండా కదల్లేని పరిస్థితి

మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటిస్తున్న అధికారులకు అడుగడుగునా స్థానికుల నుంచి ప్రతిఘటన ఎదురౌతోంది. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో ముందుకు వచ్చి అధికారులతో వాగ్వాదానికి దిగుతుండడంతో పోలీసుల సహాయం లేకుండా వారు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా వారికి సంఘీభావం తెలిపేందుకు కూడా రాని ప్రజాప్రతినిధులకు శాపనార్ధాలు పెట్టారు. ఈ సారి ఓట్లు అడిగేందుకు ఏమొఖం పెట్టుకుని వస్తారో చూస్తామంటూ వారిపై దుమ్మెత్తిపోయడంతో సర్వే సగంలోనే అధికారులు వెనుదిరిగారు.


Similar News