నిలోఫర్‌లో గాడితప్పిన వైద్యం? తాజా, మాజీ సూపరింటెండెంట్‌ల మధ్య ఆధిపత్య పోరు

నిలోఫర్‌లో తెలంగాణ డీఎంఈ డాక్టర్ వాణికి ఘోర అవమానం ఎదురైంది.

Update: 2024-11-16 02:20 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో: నిలోఫర్‌లో తెలంగాణ డీఎంఈ డాక్టర్ వాణికి ఘోర అవమానం ఎదురైంది. హాస్పిటల్ తనిఖీకి వచ్చిన ఆమె కారును గేటు వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ లోనికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఈ ఘటన వైద్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. గురువారం ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో సనా(13) సంవత్సరాల బాలిక అస్వస్థతకు గురైంది. దీంతో అధికారులు అంబులెన్స్‌లో ఆ బాలికను నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అయితే, నిబంధనల మేరకు 12 సంవత్సరాల లోపు పిల్లలకు నీలోఫర్‌లోనే వైద్యం అందించాల్సి ఉంటుంది. దీనిని అడ్డుపెట్టుకుని విధుల్లో ఉన్న డాక్టర్లు సదరు బాలికకు కనీసం ప్రాథమిక చికిత్స నిర్వహించకుండానే ఉస్మానియాకు తీసుకువెళ్లాలని సలహా ఇచ్చారు.

దీంతో గత్యంతరం లేక సదరు బాలికను ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ఇలాంటి సంఘటననే శుక్రవారం మరొకటి చోటుచేసుకుంది. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మరో 13 ఏళ్ల బాలిక వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురికావడంతో నిలోఫర్‌కు తీసుకువచ్చారు. ఆమెను కూడా ఉస్మానియాకు తీసుకువెళ్లాలని సూచించిన వైద్యులు చేతులు దులుపుకున్నారు. సీఎం కార్యక్రమంలో పాల్గొన్న బాలికలు కావడంతో వారి ఆరోగ్యం గురించి వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆరా తీశారు. బాలికలకు కనీసం ప్రాథమిక చికిత్స అందించకుండా ఉస్మానియా హాస్పిటల్‌కు తీసుకువెళ్లాలని సూచించారని తెలుసుకుని డీఎంఈకి ఫోన్ చేసి మందలించినట్లు తెలిసింది. దీంతో డీఎంఈ డాక్టర్ వాణి శుక్రవారం నిలోఫర్ ఆస్పత్రికి విచారణకు రాగా పాత భవనం రెండు గేట్లు మూసివేసిన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను గుర్తించకుండా అడ్డుకున్నారు. చివరకు ఆమె కారు దిగి బయటకు వచ్చి లోపల ఉన్న వారికి ఫోన్ చేయడంతో వారు బయటకు వచ్చి సెక్యూరిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి డీఎంఈని లోనికి తీసుకువెళ్లారు. ఈ ఘటనపై డీఎంఈ డాక్టర్ వాణిని ఫోన్ ద్వారా వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు.

వరుస సంఘటనలు..

ఇటీవల కాలంలో చోటుచేసుకుంటున్న వరుస సంఘటనలతో మళ్లీ నిలోఫర్ హాస్పిటల్ పేరు వార్తల్లో నిలుస్తోంది. ఆస్పత్రిలో ఈనెల మొదటి వారంలో నీళ్లు లేక సర్జరీలు నిలిచిపోయాయి. సంపు వద్ద ఏర్పాటు చేసిన బోరు మోటారు చెడిపోవడంతో అత్యవసర విభాగంతో పాటు ఇతర విభాగాలలో నీటి కొరత ఏర్పడింది. ఇందులో పిడియాట్రిక్ సర్జరీ, ప్రసవాల గదితో పాటు ప్రతినిత్యం సర్జరీలు జరిగే ఆపరేషన్ థియేటర్‌లు ఉన్నాయి. సుమారు రెండు రోజుల పాటు నీరు అందకపోవడంతో సర్జరీలు వాయిదా పడ్డాయి. ఈ సంఘటన మరచిపోకముందే రెండు రోజుల క్రితం అర్ధరాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు, వారి సహాయకులు, వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. తాజాగా అనారోగ్యానికి గురై వచ్చిన ఇద్దరు బాలికలకు ప్రాథమిక చికిత్స కూడా అందించకుండా తిప్పిపంపడం చర్చనీయాంశంగా మారింది.

సీనియర్ ప్రొఫెసర్ల ఆధిపత్య పోరు..?

నిలోఫర్ హాస్పిటల్‌లో ఇద్దరు సీనియర్ ప్రొఫెసర్ల మధ్య ఆధిపత్య పోరుతో పాలన గాడితప్పిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హాస్పిటల్ సూపరింటెండెంట్ కుర్చీ కోసం ఇద్దరు మాజీ, తాజా సూపరింటెండెంట్ల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల ప్రక్రియలో అప్పటి వరకు సూపరింటెండెంట్‌గా ఉన్న డాక్టర్ ఉషారాణిని నిజామాబాద్ జిల్లాకు బదిలీ చేయగా ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా డాక్టర్ రవికుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. అయితే, డాక్టర్ ఉషారాణి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. తిరిగి వచ్చిన ఆమెకు సూపరింటెండెంట్‌గా బాధ్యతలు ఇచ్చేందుకు డాక్టర్ రవికుమార్ ఇష్టపడ లేదు. దీంతో ఆమె చేసేదేమీలేక ప్రొఫెసర్‌గానే కొనసాగుతున్నారు. ఇలా వైద్యుల మధ్య నెలకొన్న విభేదాలు రోగుల పాలిట శాపంగా మారుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. మెరుగైన వైద్య సేవలు అందడం లేదనే ఆరోపణలు ఇక్కడ తరచుగా వినబడుతున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చొరవ తీసుకుని నిలోఫర్ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు అంతటా వినబడుతున్నాయి.


Similar News