ఉద్రిక్తతకు దారి తీస్తున్న మూసీ సుందరీకరణ సర్వే

మూసీ సుందరీకరణలో భాగంగా అధికారులు చేపడుతున్న సర్వే

Update: 2024-09-27 13:33 GMT

దిశ ,హైదరాబాద్ బ్యూరో : మూసీ సుందరీకరణలో భాగంగా అధికారులు చేపడుతున్న సర్వే తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తోంది. మూసీ రివర్ బెడ్ ను అనుసరించి నివాసముంటున్న వారిని గుర్తించి వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించి అందులోకి వెళ్లాలని సూచిస్తూ రెండు రోజులుగా అధికారుల బృందం పోలీస్ బందోబస్తు మధ్య సర్వే చేపడుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం అధికారుల బృందాలు మూసీ పరివాహక ప్రాంతాలను చేరుకోగా స్థానికుల నుండి ప్రతిఘటనలు ఎదురయ్యాయి. ఇండ్లకు మార్కింగ్ వేసేందుకు వారు చేసిన ప్రయత్నాలను అడ్డుకుని వెనక్కి పంపించారు .కొన్ని చోట్ల పోలీస్ బందోబస్తు మధ్య మార్కింగ్ వేసినప్పటికీ అధికారులు అక్కడి నుంచి వెళ్లిన మరుక్షణమే వాటిని చెరిపి వేశారు.

సత్య నగర్ లో ఉద్రిక్తత ....

సత్య నగర్, వినాయక నగర్, ఫణిగిరి కాలనీ తదితర ప్రాంతాల్లో మూసీ రివర్ బెడ్ నిర్వాసితుల సర్వేలో భాగంగా శుక్రవారం ఉదయం పోలీసు బలగాల సహాయంలో అధికారులు వస్తున్న సమాచారంతో స్థానికులంతా గుంపులుగా చేరి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీరికి మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, కొత్తపేట, చైతన్యపురి తదితర కార్పొరేటర్ లతో కలిసి సంఘీభావం ప్రకటించారు. పేద ప్రజల జోలికి వస్తే ఎంత మాత్రం సహించబోమని, ప్రతిఘటించి తీరుతామని ఈటెల రాజేందర్ ఈ సందర్భంగా ప్రకటించారు . అంతేకాకుండా బాధితులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్రిక్తతకు దారితీసింది.సత్య నగర్ జనప్రియ , ఎస్ఎస్ఎం రెసిడెన్సీల వద్ద ఎంపీ ఈటల రాజేందర్ స్థానికులనుద్ధేశించి మాట్లాడారు. అనంతరం బస్తీలలో పర్యటించి బాధితులలో భరోసా నింపేందుకు ప్రయత్నం చేశారు .

డీసీఎంలో అధికారులు...

మూసీ పరివాహక ప్రాంతంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించిన వారి సామాగ్రిని తరలించేందుకు ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని అధికారులు గురువారం బాధితులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. వారు ఒప్పుకోకున్నా శుక్రవారం ఉదయం డీసీఎంలతో బస్తీలకు చేరుకున్నారు. అయితే ప్రతి చోట అధికారులకు స్థానికుల నుండి ప్రతిఘటన ఎదురైంది . ప్రభుత్వాన్ని, అధికారులను మహిళలు దుమ్మెత్తి పోశారు. కొత్తపేటలో ఓ యువకుడు ఒంటి మీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా అక్కడున్న వారు అతనిని అడ్డుకున్నారు.

నేటి నుంచి కూల్చివేతలు...?

మూసీ పరివాహక ప్రాంతంలో రివర్ బెడ్ ను అనుసరించి అధికారులు రెండు రోజులుగా సర్వే చేపడుతుండగా శనివారం నుండి కూల్చివేతలు మొదలౌతాయనే ప్రచారం బస్తీలలో జరుగుతోంది. దీంతో స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా మీ దగ్గరకు అధికారులు వచ్చారా ? ఏమన్నారు ? మీ ఇల్లు ఉంటుందా ? కూలుస్తున్నారా ? అనే ప్రశ్నలు ఎదుటివారిని సంధిస్తున్నారు. డబుల్ బెడ్ రూంతో పాటు డబ్బులు ఇస్తామని చెప్పారా అంటూ సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద మూసీ సుందరీకరణ కోసం అధికారులు చేపడుతున్న సర్వే స్థానికంగా హీట్ పెంచుతోంది.


Similar News