గ్రేటర్ ఎమ్మెల్యేలలో దళితబంధు ప్రకంపనలు..
దళిత బంధు పథకం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : దళిత బంధు పథకం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో వంద మందిని ఎంపిక చేసి జాబితాను కలెక్టర్ కు పంపే బాధ్యత ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఇచ్చారు. అయితే లబ్ధిదారుల ఎంపిక కోసం కొంతమంది ఎమ్మెల్యేలు తమ అనుచరులతో మద్యవర్తిత్వం నడిపి వారికిచ్చే రూ 10 లక్షలలో రెండు నుండి మూడు లక్షల వరకు తీసుకున్నట్లు ఆరోపణల వచ్చాయి. ఎంపిక జాబితాను కలెక్టర్లకు ఇచ్చినప్పటికీ ముందు ఇచ్చిన లిస్ట్ను ఆపించి జాబితాలో పేర్లు మార్పించి రెండు, మూడు పర్యాయాలు కలెక్టర్ కు ఇచ్చారు.
ఇదే విషయం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దృష్టికి పోవడంతో ఇటీవల జరిగిన పార్టీ మినీ ప్లీనరిలో మీ అవినీతి చిట్టా నా దగ్గరుంది, ఎవరెవరు దళిత బంధులో పేర్లు చేర్చేందుకు డబ్బులు తీసుకున్నారో వారి వివరాలు నా దగ్గర ఉన్నాయి, అటువంటి వారికి టిక్కెట్లు ఇవ్వడం ఆలోచిస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మాకు టిక్కెట్ వస్తుందో ? రాదేమోనని ఆందోళన చెందుతున్నారు. కొంతమంది శాసనసభ్యులు తమ ముఖ్య అనుచరుల వద్ద ఇదే విషయాన్ని ప్రస్థావించి ముడుపులు తీసుకున్న విషయం బయటకు ఎలా పొక్కిందోనని ఆరా తీస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా గ్రేటర్ ఎమ్మెల్యేల పరిస్థితి ఉంది. ఈ పథకం కింద ముడుపులు ఇచ్చి లబ్ధి పొందిన వారు ఎమ్మెల్యేల అవినీతి గురించి బయటకు చెప్పేందుకు ముందుకు రావడం లేదు.
ముఖ్య అనుచరులకే...
ప్రతి నియోజకవర్గంలో దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక అధికారం ఎమ్మెల్యేలదే అని ఈ పథకం అమలు సమయంలో సీఎం ప్రకటించారు. అయితే వారికి ఇలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అర్హులైన వారిని ఎంపిక చేయకుండా తమ ముఖ్య అనుచరులు, వారు సూచించిన పేర్లను లిస్ట్ లో చేర్చారు. తర్వాత అవసరాలను బట్టి లబ్ధిదారుల పేర్లను మార్చారు. వాస్తవానికి ప్రతి నియోజకవర్గంలో దళితబంధుకు అర్హులైన వారు వేల సంఖ్యలో ఉన్నారు. వారంతా తమకు దళితబంధు ఇవ్వాలని ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి దరఖాస్తులు పెట్టుకున్నారు.
అయితే ఇలా వచ్చిన దరఖాస్తుల నుండి ఎంపిక పారదర్శకంగా చేపట్టవలసినప్పటికీ ముఖ్యఅనుచరులను దగ్గర పెట్టుకుని ముడుపులు ఇచ్చిన వారిని మాత్రమే అర్హులుగా గుర్తించి జాబితాలో పేర్లను చేర్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా దళితబంధు ఆశించి భంగపడిన వారు ఎమ్మెల్యేల అవినీతిని ఎక్కడ పడితే అక్కడ చర్చించుకోవడంతో అసలు విషయం వెలుగు చూశాయి. దీనికితోడు ప్రభుత్వ నిఘా విభాగాల నుండి కూడా సేకరించిన సమాచారంతో సీఎం హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉండగా దళితబంధు పథకం కింద ప్రతినియోజకవర్గంలో లబ్ధిదారులను పెంచుతామని సీఎం చెప్పడంతో ఆశావహులు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
లిస్ట్ మార్పిడికి అర్థమేమిటి ...?
దళిత బంధు పథకం కింద ఎంపిక చేసిన లబ్ధిదారుల పేర్లతో కూడిన లిస్ట్ ను కలెక్టర్ కు ఇచ్చిన కొంతమంది ఎమ్మెల్యేలు ఆ జాబితాను పక్కన పెట్టించి మరొకటి ఎందుకు ఇచ్చారు ? ఇలా ఎమ్మెల్యేలు తరచుగా లిస్ట్ లోని పేర్లను మార్చడం, రెండు, మూడు జాబితాలు ఇవ్వడం వెనుక అర్ధమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. జాబితాలు మారాయంటే అందులోని పేర్లు కూడా మారినట్టేనని, మరి ముందుగా లిస్ట్ లో ఉన్న పేర్లను తొలగించాల్సిన అవసరం ఏమిటో ఎమ్మెల్యేలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అనుచరులు, ముడుపులు ఇచ్చిన వారికే దళితబంధు ఇచ్చారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో దళితబంధు లబ్ధిదారుల ఎంపిక మరోమారు చర్చనీయాంశమైంది. గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో ఈ పథకంపై మరింత లోతుగా విచారణ జరిపితే ఎమ్మెల్యేల అవినీతి బహిర్గతమయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు అంతటా వ్యక్తమౌతున్నాయి.