వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య..
ఓ వివాహిత వరకట్న వేధింపులతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
దిశ, మియాపూర్: ఓ వివాహిత వరకట్న వేధింపులతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధి సింగోటం గ్రామానికి చెందిన ఎల్లా స్వామి, జయసుధ దంపతులకు ముగ్గురు కూతుళ్లు. మూడో కూతురు హేమలత (24)ను కొండ్రావుపల్లికి చెందిన నాగరాజుతో గత సంవత్సరం మే 25న వివాహం జరిపించారు. నాగరాజు తండ్రి స్వామి, తల్లి ఈశ్వరమ్మ, సోదరుడుతో కలిసి మియాపూర్ లోని ఎంఏనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. నాగరాజు డ్రైవర్ గా పనిచేస్తుండగా నాగరాజు తల్లిదండ్రులు సమీప కాలనీలో పూల వ్యాపారం చేస్తున్నారు.
కాగా ఉదయం 11 గంటలు అవుతున్నా హేమలత బయటికి రాకపోవడంతో అత్త ఈశ్వరమ్మ తలుపు తట్టగా పలక లేదు. దీంతో స్థానికుల సహాయంతో కిటికి నుంచి చూడగా ఫ్యాన్ కు చున్నీతో ఉరేసుకుని కనిపించింది. తలుపులు బద్దలు కొట్టి కిందికి దింపగా అప్పటికే మరణించింది. వరకట్న వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.