ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Update: 2022-02-07 16:17 GMT

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: చెరువులను, కుంట‌లను వాటి ప‌రివాహక ప్రాంతాల‌ను కాపాడాల్సిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి వివాదాస్పద వాఖ్యలు చేశారు. ఎఫ్‌టీఎల్‌లో భూముల‌ను ఆక్రమించి ఇండ్లను నిర్మించుకున్న వారికి అనుమ‌తులు ఇచ్చేలా చ‌ర్యలు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. చెరువుల‌ను, కుంట‌ల‌ను కాపాడుతామ‌ని చెబుతూనే, మ‌రోవైపు ఓట్ల కోసం ఇలాంటి రాజ‌కీయాలు చేయ‌డం తగదని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో స‌రూర్‌న‌గ‌ర్ చెరువును ఆక్రమించి లే అవుట్ చేసి వంద‌ల కోట్ల రూపాయ‌ల‌తో రియ‌ల్ మాఫియా పాట్లను విక్రయించింది. ఇప్పడు ఆ చెరువు ఎఫ్‌టీఎల్ భూముల‌ను కాపాడాల్సిన ప్రజా ప్రతినిధి వాటికి అనుమ‌తులు వ‌చ్చేలా చేస్తామ‌ని చెప్పడం వివాదాస్పదంగా మారింది. అవి చెరువు శిఖం భూములని, వాటిని కొనడానికి వీళ్లేదని తెలిసినా, కొంతమంది అక్రమార్కులు చెరువుల‌ను, ఎఫ్‌టీఎల్‌ల‌ను ఆక్రమించి లే అవుట్‌లు చేసి విక్రయించారు. వాటిని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు ఓట్ల కోసం వాటిని క్రమ‌బ‌ద్ధీక‌రిస్తామ‌ని చెప్పడం హ‌స్యాస్పదంగా ఉంద‌ని ప‌లువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎఫ్‌టీఎల్ భూముల్లో ఇండ్లను నిర్మించ‌డం చ‌ట్టరీత్యా నేరం. అయినా రాజ‌కీయ ప‌లుకుబ‌డితో, అధికారుల అండ‌దండ‌ల‌తో ఆ భూముల్లో కాల‌నీలు వెలిశాయి. అయితే వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పడు అవి పూర్తిగా నిండి ఇండ్లు వ‌ద‌ర‌ల్లో మునిగి తేలుతున్నాయి. ఎఫ్‌టీఎల్ భూముల‌ను స్వాధీనం చేసుకొని, ఇత‌ర ప్రాంతాల్లో ఇండ్లను కేటాయించాల్సిన ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆ దిశగా చ‌ర్యలు చేప‌ట్టక‌పోవ‌డం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఎప్పటికైనా ఎఫ్‌టీఎల్‌లో ఇండ్లను నిర్మించికున్న వారు భారీ వ‌ర్షాలు వ‌చ్చిన‌ప్పుడు నీట మున‌గాల్సిందే. ఈ విష‌యం తెలిసినా ప్రజా ప్రతినిధులు వారికి అనుమ‌తులు ఇప్పిస్తామ‌ని చెప్పడం ప‌ట్ల ప‌లువ‌రు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ చెరువుల‌ను, శిఖం భూముల‌ను, ఎఫ్‌టీఎల్ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి చెరువుల‌ను కాపాడాల‌ని కోరుతున్నారు. లేని ప‌క్షంలో భ‌విష్యత్తులో భూ క‌బ్జాదారులు చెరువుల్లో కూడా లే అవుట్‌లు చేసి ఇండ్లు నిర్మించి క్రమ‌బ‌ద్ధీక‌రించాల‌ని కోరుతార‌ని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News