‘బస్సు ఫ్రీ అంటివి,ఇల్లు కూల్చి మహిళల గొంతు కోస్తావా’..మండిపడుతున్న బాధితులు

40 ఏళ్లు పైసా పైసా కూడబెట్టి ఇల్లు కడితే కూలుస్తావా... ఇదెక్కడి న్యాయం

Update: 2024-09-27 15:59 GMT

దిశ, కార్వాన్ : 40 ఏళ్లు పైసా పైసా కూడబెట్టి ఇల్లు కడితే కూలుస్తావా... ఇదెక్కడి న్యాయం సీఎం రేవంతన్న, మా ఉసురు తగిలి పోతావ్. ఆరు పథకాలు అంటివి... బస్సు ఫ్రీ అంటివి... ఇల్లు కూల్చి మహిళల గొంతు కోస్తావా... సావనైన చస్తాము కానీ, ఇల్లును వదిలి పెట్టేది లేదు. అంటూ మహిళలు అధికారులపై రోదిస్తూ మాటలతో విరుచుకుపడ్డారు. నగరంలోని మూసీ సుందరీకరణ కోసం రివర్ బెడ్ లో ఉన్నటువంటి కట్టడాలను కూల్చేందుకు సంబంధిత అధికారులు శుక్రవారం మార్కింగ్ చేస్తుండడంతో కొందరు అడ్డుకున్నారు. అంతేకాకుండా పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ వే 102 పిల్లర్ నెంబర్ వద్ద మూసి రివర్ అలైన్మెంట్ తప్పుగా సర్వే జరిగిందని, రాందేవ్ గూడ, లంగర్ హౌస్, అంబేద్కర్ నగర్, బాపు నగర్, డిఫెన్స్ కాలనీ కి చెందిన సుమారు 150 మంది తో ఆందోళన చేపట్టారు.

ఈ క్రమంలో అత్తాపూర్ వైపు కిలోమీటర్ వైపు ట్రాఫిక్ జామ్ నెలకొనడంతో వాహనదారులు పలు ఇబ్బందులకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే వారిని సముదాయించి, మూసీ రివర్ ప్రాజెక్టు అధికారులతో మాట్లాడేందుకు సౌత్ అండ్ వెస్ట్ జోన్ అదనపు డీసీపీ అశ్వక్ ప్రగతి భవన్ కు బాధితులైన ఓ పదిమందిని సమస్యను పరిష్కరించేందుకు తరలించారు. అంతేకాకుండా జియాగూడ పరిధిలోని మూసీ రివర్ బెడ్ లో మార్కింగ్ చేస్తుండగా బాధితులు సుమారు వందకు పైనే మంది పటేల్ హోటల్ వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు అక్కడికి వచ్చి బాధితులను సముదాయించారు. ఈ సందర్భంగా కొందరు బాధిత మహిళలు మాట్లాడుతూ పేదలమైన మేము 40 ఏళ్లు కష్టపడి పైసా పైసా కూడబెట్టి ఇల్లు కడితే కూలుస్తారా, ఇది ఎక్కడి న్యాయం అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఆరు పథకాలు అంటివి, బస్సు ఫ్రీ అంటివి, మహిళలు సంతోషంగా ఉన్నారని అంటివి. ఇల్లు కూల్చి మహిళల గొంతు కోస్తావా.. ఇదెక్కడి న్యాయం రేవంతన్న, మా ఉసురు తగులుతుందని బాధిత మహిళలు ఆరోపించారు. డబుల్ బెడ్ రూమ్ లో ఉండాలా సీఎం రేవంత్ అన్న మీరు, మీ భార్య, మీ పిల్లలతో ఉంటారా, మీకో న్యాయం... మాకో న్యాయమా... రేవంతన్న అని బాధితులు ఆరోపించారు.


Similar News