అయ్యప్ప సొసైటీపై ఇంటెలిజెన్స్ ఆరా

చందానగర్ సర్కిల్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఆ ఇద్దరు ఎవరు అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Update: 2024-09-05 03:35 GMT
అయ్యప్ప సొసైటీపై ఇంటెలిజెన్స్ ఆరా
  • whatsapp icon

దిశ, శేరిలింగంపల్లి : చందానగర్ సర్కిల్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఆ ఇద్దరు ఎవరు అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్‌కు చెందిన కిందిస్థాయి ఉద్యోగులు చేస్తున్న అరాచకాలు, వసూళ్లు అంత భారీ మొత్తంలో ఉన్నాయా అని ఉన్నతాధికారులు నోరెళ్లబెడుతున్నారంటే ఆ ఉద్యోగుల హవా ఎలా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా వచ్చిన ప్రతీ అధికారి చందానగర్ సర్కిల్ మీద స్పెషల్ ఫోకస్ పెడుతుంటారు. అయినా కిందిస్థాయి సిబ్బంది ఆగడాలకు అడ్డుకట్ట వేయలేక పోయారనే చెప్పాలి. ఉన్నతాధికారులు కిందిస్థాయి ఉద్యోగుల మీద దృష్టిపెట్టిన ప్రతీసారి అధికారులు బదిలీ అయ్యారే కానీ వారిని మాత్రం కదిలించలేకపోయారంటే వారి మేనేజ్మెంట్ స్కిల్స్ ఏ స్థాయిలో ఉంటాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం పక్కనపెడితే వీరి సలహాలు, సూచనలతో బఫర్, ఎఫ్టీఎల్‌లో అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు కావడం వీరి అవినీతికి అధికారులు ఎలా బలవుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

సమగ్ర సమాచార సేకరణ..

చందానగర్ సర్కిల్ కార్యాలయం టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లో జరుగుతున్న అవినీతి దందా పై గత కొంతకాలంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఇక్కడ పనిచేస్తున్న అధికారులు, కిందిస్థాయి సిబ్బంది పై చాలా రోజులుగా అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. చందానగర్ సర్కిల్ 21లోని మియాపూర్, మాదాపూర్, హఫీజ్‌పేట్ డివిజన్లలో నూతన నిర్మాణాల కోసం అనుమతులు, ఇల్లీగల్ నిర్మాణాల వద్ద స్లాబ్ లెక్కన జీహెచ్ఎంసీ సిబ్బంది వసూళ్లు చేస్తున్నారంటూ పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించి ఓ బాధితుడు గతంలో మీడియా సాక్షిగా తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇల్లీగల్ కట్టడాలను కూల్చకుండా ఉండేందుకు తమ వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది భారీగా వసూళ్లు చేశారని పలువురు బాధితులు వీడియో రికార్డులు కూడా తెరమీదకు వస్తున్నాయి. అలాగే దిశ దినపత్రికలో అయ్యప్ప సొసైటీలో ఆ ఇద్దరు కథనం నేపథ్యంలో ఇంటెలిజెన్స్ సిబ్బంది కూడా ఆ ఇద్దరి వ్యవహారంపై పూర్తిస్థాయిలో సమాచారం సేకరించే పనిలో పడ్డారు. గతంలో ఇక్కడ డీసీగా పనిచేసిన వంశీకృష్ణ, ఏసీపీ రాజ్‌కుమార్ పై ఇంటెలీజెన్స్ సిబ్బందే ప్రభుత్వానికి నివేదిక అందించగా..తాజాగా ఈ ఇద్దరి ఆగడాలపై కూడా సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే ప్రభుత్వంలోని పెద్దాయన పేరు చెబుతూ సాయంత్రాలు కలుస్తున్నామని చెప్పుకుంటున్న సిబ్బందిపై సైతం నిఘా పెట్టారని సమాచారం.

సిండికేట్ గ్రూప్..!

కొందరు బిల్డర్లు గ్రూప్‌గా ఏర్పడి మాదాపూర్ అయ్యప్ప సొసైటీ, ఖానామెట్, సీజేఆర్ స్కూల్, సర్వే ఆఫ్ ఇండియాలో విచ్చలవిడిగా నిర్మాణాలు చేపడుతున్నారు. వీరికి జీహెచ్ఎంసీ సిబ్బంది నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయని తెలిసింది. వీరు కాకుండా ఎవరైనా అక్కడ నిర్మాణాలు సాగించాలంటే అంత ఈజీ కాదు. ప్రతీదానికి కండిషన్స్ అప్లై అవుతాయి. జీహెచ్ఎంసీ సిబ్బందితో పాటు సిండికేట్ బిల్డర్లను కలిస్తేనే పని పూర్తవుతుంది. లేదా అడుగడుగునా అవాంతరాలు ఎదుర్కోక తప్పదు. కాదు కూడదు అంటే మీడియా పేరు చెప్పి, అక్రమ నిర్మాణాలపై పత్రికల్లో వార్తలు వస్తున్నాయని, మీ మీద ఫిర్యాదులు అందాయని చెబుతూ కొత్త నిర్మాణాలకు బొక్కలు పెడుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది తీరు అడిగింది ఇచ్చిన వారికి ఒకలా..ఇయ్యని వారికి మరోలా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. సిండికేట్ రింగ్ నడిపిస్తున్న బిల్డర్లు ఇటీవల హైడ్రా పేరు చెప్పి కూడా నిర్మాణదారుల వద్ద భారీగా వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈదుల కుంట ఎఫ్టీఎల్‌లో ఉన్న అయ్యప్ప సొసైటీపై హైడ్రా దృష్టిపెట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

అధికారులపై క్రిమినల్ కేసులు..

చందానగర్ సర్కిల్ పరిధిలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన గతంలో డీసీగా వ్యవహరించిన నందగిరి సుదాంష్, ఏసీపీ రాజ్‌కుమార్ పై హైడ్రా అధికారుల ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఉన్నతాధికారులను కిందిస్థాయి సిబ్బందే తప్పుదోవపట్టించారని, వారి ప్రోద్భలంతోనే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకుండానే చెరువు ఎఫ్టీఎల్‌లో అనుమతులు ఇచ్చారని జీహెచ్ఎంసీలో తీవ్ర చర్చ నడుస్తోంది. కిందిస్థాయి సిబ్బంది వల్లనే ఉన్నతాధికారులు బలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా మియాపూర్, చందానగర్ డివిజన్‌లలో చెరువులు, కుంటల్లో కూడా జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి పర్యవేక్షణ లేకుండా అనుమతులు జారీ చేశారని స్వయంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా కిందిస్థాయి సిబ్బంది మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, చేతివాటం కారణంగానే సిబ్బంది ఆడిందే ఆట..పాడిందే పాటగా మారిందని, చందానగర్ సర్కిల్ టీపీఎస్ సెక్షన్‌లో పూర్తిస్థాయి ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని బాధితులు కోరుతున్నారు.


Similar News